SRH vs KKR : సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట టెస్టు బ్యాటింగ్ తో ఫ్యాన్స్ కు కోపం తెప్పించేలా చేస్తోంది. వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ పై ఆశలు కల్పించిన సన్ రైజర్స్ అంతలోనే పేలవ ఆట తీరుతో వరుసగా ఐదు మ్యాచ్ లో ఓడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో దారుణ పరాభవాన్ని మూట గట్టకుంది. అధికారికంగా ప్లే ఆఫ్స కు చేరే అవకాశాలు ఉన్నా.. హైదరాబాద్ ఆటతీరును చూస్తే అది కష్టంగానే కనిపిస్తోంది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. భారీ విజయం సాధించడంతో మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోసారి ఓపెనర్లు శుభారంభం చేయలేకపోయారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 9; 1 ఫోర్) మరోసారి టెస్టు బ్యాటింగ్ తో ఆరంభంలోనే సన్ రైజర్స్ ఓటమికి బాటలు వేశాడు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (9) సౌతీ పట్టిన అద్భుత రిటర్న్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కరమ్ (25 బంతుల్లో 32; 3 సిక్సర్లు) ఆడటంతో సన్ రైజర్స్ లక్ష్యం వైపు కదిలింది. ప్రమాదకరంగా కనిపించిన అభిషేక్ శర్మను వరుణ్ చక్రవర్తి పెవలియన్ కు చేర్చాడు. నికోలస్ పూరన్ (2) అలా వచ్చి ఇలా వెళ్లాడు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో మార్కరమ్ హిట్టింగ్ కు దిగాడు. ఈ క్రమంలో మూడు భారీ సిక్సర్లు బాదాడు. అయితే భారీ షాట్ కొట్టే క్రమంలో యాదవ్ బౌలింగ్ లో వికెట్ల మీదుకు ఆడుకొని పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత సుందర్ (4), శశాంక్ సింగ్ (11) వెనుదిరగడంతో సన్ రైజర్స్ ఓటమిని అంగీకరించింది.
టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా... ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్యామ్ బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఒక చెయ్యి వేయడంతో కేకేఆర్ మంచి స్కోరునే అందుకోగలిగింది. ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లుతీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Shreyas Iyer, SRH, Sunrisers Hyderabad