IPL 2022 SRH VS DC SRH VS DC HIGHLIGHTS DELHI CAPITALS OPENER DAVID WARNER TAKES REVENGE ON HIS FORMER TEAM SUNRISERS HYDERABAD SJN
David Warner : నాడు అవమానం.. నేడు ప్రతీకారం.. కానీ, నువ్వేప్పటికీ మా డేవిడ్ భాయ్ వే..
డేవిడ్ వార్నర్ (PC : TWITTER)
David Warner : డేవిడ్ వార్నర్ (david warner).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత నిలకడైన విదేశీ ప్లేయర్. ఇండియన్ ప్లేయర్స్ సొంత మైదానంలో ఆడినట్లే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో తన బ్యాట్ పదును ఏంటో చూపాడు. తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi dare Devils) తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు.. 2013 వరకు కూడా ఆ జట్టుతోనే గడిపాడు.
David Warner : డేవిడ్ వార్నర్ (david warner).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత నిలకడైన విదేశీ ప్లేయర్. ఇండియన్ ప్లేయర్స్ సొంత మైదానంలో ఆడినట్లే డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో తన బ్యాట్ పదును ఏంటో చూపాడు. తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ (Delhi dare Devils) తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు.. 2013 వరకు కూడా ఆ జట్టుతోనే గడిపాడు. ఇక 2014 సీజన్ కోసం వేలంలో వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు కొనుగోలు చేసింది. ఇక్కడి నుంచి వార్నర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ల దశ పూర్తిగా మారిపోయాయి. తన మార్కు ఆటతో సన్ రైజర్స్ కు వార్నర్ ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అదే సమయంలో బ్యాడ్ బాయ్ ఇమేజ్ నుంచి గుడ్ బాయ్ ఇమేజ్ కు వార్నర్ ను మార్చేందుకు సన్ రైజర్స్ జట్టు సాయపడింది.
ఇక 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఐపీఎల్ చాంపియన్ గా నిలబెట్టడంలో వార్నర్ పాత్ర మరువలేనిది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు వార్నర్ కాస్తా.. డేవిడ్ భాయ్ అయ్యాడు. టీమిండియా ఆటగాళ్లను ఏ విధంగా ఆరాధిస్తామో అదే విధంగా వార్నర్ ను ఆరాధించడం మొదలు పెట్టారు. ఇక వార్నర్ అండ్ ఫ్యామిలీ తెలుగు హీరోల పాటలకు డ్యాన్స్ చేస్తూ మనకు మరింత చేరువయ్యాడు. అయితే 2021 సీజన్ తో వార్నర్, సన్ రైజర్స్ అనుబంధానికి తెర పడింది. పూర్ ఫామ్ అంటూ వార్నర్ నుంచి కెప్టెన్సీని లాగేసుకున్న సన్ రైజర్స్ అనంతరం అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. వార్నర్ తో కూల్ డ్రింక్స్ కూడా మోయించింది. ఫలితంగా వార్నర్ అవమానకరరీతిలో హైదరాబాద్ జట్టును వీడాల్సి వచ్చింది.
అయితే 2022 ఐపీఎల్ సీజన్ కోసం వార్నర్ పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని మరోసారి సొంతం చేసుకుంది. ఇక పాకిస్తాన్ టూర్ వల్ల ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లకు దూరంగా ఉన్న వార్నర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ముందు వరకు కూడా వరుసగా 4(12), 61(45), 66(38), 60*(30), 28(14), 42(26), 3(4) తన ఫామ్ ను చాటాడు. ఇక గురువారం బ్రబోర్న్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అయితే విశ్వరూపం ప్రదర్శించాడు. నాడు అవమానించిన టీంపై ప్రతీకార ఇన్నింగ్స్ తో చుక్కలు చూపించాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒక వేళ ఈ మ్యాచ్ గనుక హైదరాబాద్ లో జరిగి ఉంటే మాత్రం మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులందరు కూడా డేవిడ్ భాయ్ అంటూ అతడికి నీరాజనాలు కొట్టేవారు. టీవీల్లో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్ ఆడుతున్నంత సేపు చప్పట్ల వర్షం కురిపించారంటే అతిశయోక్తి కాదు. మ్యాచ్ అనంతరం వార్నర్ లాంటి ప్లేయర్ ను ఎలా వదులుకున్నావంటూ మరోసారి సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ పై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం.. ఆరెంజ్ ఆర్మీ దృష్టిలో వార్నర్ ఎప్పటికీ డేవిడ్ భాయ్ వే..
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.