IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇప్పటి వరకు బోణీ కొట్టని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), సన్ రైజర్స్ హైదరాాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. ముంబై (Mumbai)లోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్లు బోణీ కోసం పోటా పోటీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30 నుంచి ఆరంభం కానుంది. కొత్త సారథి రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నాయకత్వంలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల హ్యాట్రిక్ ను పూర్తి చేయగా... కేన్ విలియమ్సన్ (Kane Williamson) సారథిగా ఉన్నసన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. దాంతో రేపటి మ్యాచ్ తో ఈ రెండు జట్లలో ఒకటి లీగ్ లో పాయింట్ల ఖాతా తెరిచే అవకాశం ఉంది.
రొమారియో షెపర్డ్ పై వేటు తప్పదా
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ. 7.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్ పై వేటు పడేలా కనిపిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ షెపర్డ్ బౌలింగ్ లో రాణించినా బ్యాట్ తో సత్తా చాటలేకపోయాడు. కీలక సమయాల్లో బ్యాట్ తో విఫలమై టీమ్ మేనేజ్ మెంట్ ను నిరాశ పరిచాడు. దాంతో ఇతడి స్థానంలో సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జన్సెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గత మ్యాచ్ ల్లో తీవ్రంగా నిరాశ పరిచిన... అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లను కొనసాగిస్తారా లేక వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో అదరగొట్టిన రవి కుమార్ సమర్థ్ ను సమద్ లేదా అభిషేక్ శర్మ స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రియమ్ గార్గ్ కు కూడా అవకాశం ఇచ్చేలా టీం కనిపిస్తోంది. ఇక ఉమ్రాన్ మాలిక్ 150 కి.మీ వేగంతో బంతులు వేస్తున్నా... బౌలింగ్ లో వైవిధ్యం చూపలేకపోతున్నాడు. అతడు కేవలం వేగాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాడు. అతడు వేసే వేగం వల్ల బ్యాట్ కు బంతి తగిలితే చాలు ఫోర్ లేదా సిక్సర్ వస్తుంది. ఇక రెండు మ్యాచ్ ల్లోనూ విఫలమైన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో రాణించాల్సి ఉంది. ఇక ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిన చెన్నై పరిస్థితి కూడా ఏం బాగాలేదు. రుతురాజ్ ఫామ్ లో లేకపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. అదే సమయంలో రాబిన్ ఉతప్ప నిలకడగా ఆడకపోవడం జట్టుకు సమస్యగా మారింది. ఇక జడేజా కెప్టెన్సీ చతురత ఏ మాత్రం పనిచేయడం లేదు. ఐపీఎల్ టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే చెన్నై ఆటతీరు ఇక నుంచి అయినా మారాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లోనూ ఓడితే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతూ వస్తాయి.
ముఖాముఖి
ముఖాముఖి పోరులో చెన్నై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్ లు జరగ్గా అందులో 12 మ్యాచ్ ల్లో చెన్నై విజయం సాధించింది. మరో నాలుగింటిలో సన్ రైజర్స్ గెలిచింది. గత ఆరు మ్యాచ్ ల్లోనూ చెన్నై 4 సార్లు గెలవగా... హైదరాాబాద్ 2 సార్లు మాత్రమే గెలిచింది.
తుది జట్ల అంచనా
సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్ రమ్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, సమద్/సమర్థ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రన్ మాలిక్
చెన్నై సూపర్ కింగ్స్ : రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ధోని, శివమ్ దూబే, మొయిన్ అలీ, ప్రిటోరియస్, బ్రావో, జోర్డాన్, ముఖేశ్ చౌదరి/సిమర్ జీత్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.