ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. అయితే.. అసలకే ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ పై ఈ సీజన్ లో ఏదీ కలసిరావడం లేదు.
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై కందిరీగలు కూడా కన్నెర్ర చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో డీవై పాటిల్ మైదానం వేదికగా గురువారం జరగనున్న మ్యాచ్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్న ముంబై ఆటగాళ్లపై కందరీగలు దాడి చేశాయి. దీంతో ముంబై ఇండియన్స్ మంగళవాం తమ ప్రాక్టీస్ సెషన్‌ను అర్థంతరంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విటర్ వేదికగా తెలియజేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.
18 సెకన్ల నిడివి గలిగిన ఈ వీడియోలో కందిరీగల నుంచి తప్పించుకునేందుకు ముంబై ఆటగాళ్లంతా నేలపై పడుకొని కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ముంబైకి ఏదీ కలసిరావడం లేదు.. ఇప్పుడు ఈ దాడి జరిగి ఉంటే అసలకే ప్రమాదం వచ్చి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
గత సీజన్ వరకు ముంబై జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్‌రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్‌లో సహకారం లేదు. ఈ లోపాల్ని సరిదిద్దుకోకపోతే.. ముంబై ఈ సీజన్ లో అత్యంత చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.