IPL New Franchises: బీసీసీఐ పంట పండింది.. రెండు జట్లకు రూ. 12690 కోట్లు.. బిడ్లు గెలిచిన సీవీసీ క్యాపిటల్, ఆర్పీ సంజీవ్ గోయెంకా

ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లకు భారీ ధర.. సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్, ఆర్పీ సంజీవ్ గోయెంకా

  • Share this:
    ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ పిలిచిన టెండర్లతో భారీ ఆదాయం సమకూరింది. కేవలం రెండు జట్లను రూ. 12,690 కోట్లకు సీవీసీ క్యాపిటల్, ఆర్పీ-సంజీవ్ గోయెంకా గెలుచుకున్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం సీవీసీ క్యాపిటల్ అత్యధికంగా రూ. 5600 కోట్లు, లక్నో ఫ్రాంచైజీ కోసం ఆర్పీ-సంజీవ్ గోయెంకా రూ. 7090 కోట్లకు బిడ్లు దాఖలు చేశారు. మొత్తం 22 సంస్థలు టెండర్ల డాక్యుమెంట్లను కొనుగోలు చేయగా.. వాటిలో 10 మందికి మాత్రమే టెక్నికల్ అర్హత లభించింది. అయితే ఫైనాన్షియల్ బిడ్ల వేయడానికి సరైన సమయంలో ఎంఎస్ ధోనీకి చెందిన రిథి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆలస్యంగా రావడంతో దానికి టెండర్ల ప్రక్రియ నుంచి తొలగించారు. యూరోపియన్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్లు అయిన గ్లేజర్ ఫ్యామిలీ టెక్నికల్ బిడ్ అప్రూవ్ అయ్యింది. కానీ లక్నో కోసం వాళ్లు వేసిన ఫైనాన్షియల్ బిడ్ గెలుచుకోలేకపోయింది.

    అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీ అదానీ గ్రూప్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నది. మీడియాలో కూడా అదాని గ్రూప్‌కు ఆ ఫ్రాంచైజీ దక్కినట్లే అని అందరూ భావించారు. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈక్విటీ కంపెనీ సీవీసీ క్యాపిటల్స్ అత్యధికంగా రూ. 5600 కోట్ల బిడ్ దాఖలు చేసింది. దీంతో మిగతా కంపెనీలను అన్నింటినీ తోసిరాజని సీవీసీ కొత్త ఫ్రాంచైజీని గెలుచుకున్నది. మోటార్ స్పోర్ట్ అయిన ఫార్ములా వన్ వ్యవస్థాపక సంస్థల్లో సీవీసీ క్యాపిటల్ ఒకటి. స్పోర్ట్స్ సంబంధిత వ్యాపారాలను ప్రమోట్ చేయడంలో ముందు నుంచి ఆసక్తికరంగా ఉన్న సీవీసీ క్యాపిటల్.. గతంలో ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీలో వాటాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించింది. కానీ ఈ సారి ఏకంగా ఐపీఎల్ టీమ్‌నే గెలుచుకున్నది. అదాని వంటి బడా కంపెనీలను కూడా పక్కకు నెట్టేసి సీవీసీ క్యాపిటల్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

    ఇక లక్నో కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న ఫ్రాంచైజీ కోసం ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌తో పాటు మాంచెస్టర్ యునైటెడ్ ప్రమోటర్స్, అరబిందో ఫార్మా, టొరెంట్ ఫార్మా వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఆర్పీ-సంజీయ్ గోయెంకా గ్రూప్ లక్నో ఫ్రాంచైజీ కోసం రికార్డు స్థాయిలో రూ. 7090 కోట్లకు బిడ్ దాఖలు చేసి టెండర్ దక్కించుకున్నాడు. గతంలో ఆర్పీ - సంజీవ్ గోయెంకా గ్రూప్ పూణే కేంద్రంగా 'రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్' ఫ్రాంచైజీని నిర్వహించింది. అయితే ఆ జట్టు కేవలం రెండేళ్ల కాలం వ్యవధికే పరిమితం కావడంతో ఆర్పీ-సంజీవ్ గోయెంకా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. తాజాగా లక్నో ఫ్రాంచైజీని గెలుచుకోవడం ద్వారా తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టారు.

    ఐపీఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ రూ. 2000 కోట్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రెండు ఫ్రాంచైజీలు కలిపి కనీసం రూ. 6000 కోట్ల నుంచి రూ. 7500 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించింది. అయితే బీసీసీఐని ఆశ్చర్చ పరుస్తూ కేవలం సంజీవ్ గోయెంకానే రూ. 7090 కోట్లకు బిడ్ దాఖలు చేయడం విశేషం,. ప్రస్తుతం రెండు ఫ్రాంచైజీలు కలిపి బీసీసీఐ ఖజానాలోకి రూ. 12690 కోట్లు చేరుతుండగం గమనార్హం.
    Published by:John Naveen Kora
    First published: