ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) వచ్చే ఏడాది జనవరి నెలలో మెగా వేలం పాట (Mega Auction) నిర్వహించనున్నది. 14 ఏళ్ల తర్వాత పాత 8 ఫ్రాంచైజీలతో పాటు కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీలు ఈ మెగా వేలం పాటలో భాగస్వామ్యం కానున్నాయి. అంతకు ముందు పాత 8 జట్లు ఈ నెల 30 లోపు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఐపీఎల్‌లోని అన్ని పాత జట్లకు గరిష్టంగా ముగ్గురు స్వదేశీ.. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఇద్దరి కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ కాంబినేషన్లు అన్నీ కుదిరేలా గరిష్టంగా నలుగురిని రిటైన్ (Retain Policy) చేసుకోవచ్చు. అయితే అన్ని జట్లు ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని కసరత్తు చేస్తుండగా మూడు ఫ్రాంచైజీలు మాత్రం కెప్టెన్ల కేటలో పడ్డాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్స్ కెప్టెన్లుగా ఎవరిని నియమించుకోవాలా అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ జట్టుకు గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈ ఏడాది జట్టుతో పాటు కొనసాగడం లేదని యాజమాన్యానికి తేల్చి చెప్పాడు. రాబోయే సీజన్లో కేఎల్ రాహుల్ కొత్తగా వచ్చిన లక్నో జట్టుకు కెప్టెన్‌గా మారే అవకాశం ఉన్నది. దీంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ విషయంలో కసరత్తు చేస్తున్నది. ముందుగా ఆటగాళ్లలో ఎవరిని రిటైన్ చేసుకోవాలన్న విషయంలో కూడా పంజాబ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. క్రికెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సారి పంజాబ్ కింగ్స్ ఎవరినీ రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదు. వేలంలో డేవిడ్ వార్నర్ లేదా సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లను కొనుగోలు చేస్తే వారిలో ఒకరిని కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నది.
ఇక విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా జట్టుకు, ఐపీఎల్ 2021 తర్వాత ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా ఉండబోనని ముందే తేల్చి చెప్పాడు. దీంతో వచ్చే సీజన్లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ కావల్సి ఉన్నది. ఆర్సీబీ యాజమాన్యం మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కల్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ ముగ్గురూ కెప్టెన్లు అయ్యే అవకాశం లేదు. దీంతో కొత్తగా వేలంలో కొనుక్కునే ఆటగాళ్లలో ఒకరిని కెప్టెన్ చేయాలని భావిస్తున్నది. డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్‌లలో ఎవరికైనా ఈ అవకాశం దక్కవచ్చు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుది విచిత్రమైన పరిస్థితి. కేకేఆర్‌కు ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగాడు. కానీ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ విజయవంతం అయినా.. ఒక బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. దీంతో అతడిని రిటైన్ చేసుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపించడం లేదు. కొత్తగా వేలంలో ఎవరినైనా కొనుగోలు చేసి కెప్టెన్సీ అందించాలని భావిస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022, Kolkata Knight Riders, Punjab kings, Royal Challengers Bangalore