RCB vs PBKS : మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్టే పై చేయి సాధించింది. సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించిన పంజాబ్ కింగ్స్.. శుక్రవారం రాత్రి బ్రబోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు సజీవంగా నిలుపుకుంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకిగి దిగిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇది 6వ విజయం కావడం విశేషం. తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీకి సీజన్ లో ఇది 6వ ఓటమి కావడం విశేషం. ప్రస్తుతం ఆజట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడటంతో టాప్ 2లో నిలిచే అవకాశాన్ని ఆర్సీబీ జట్టు మిస్ చేసుకుంది. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా కఠినం చేసుకుంది. ఈ నెల 19న గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి మంచి టచ్ లో కనిపించిన విరాట్ కోహ్లీ (20) రబడ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వెంటనే ఫాఫ్ డు ప్లెసిస్ (10) కూడా అవుటయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన మహిపాల్ (6) ప్రభావం చూపలేకపోయాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పటిదార్ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగాఆడటంతో ఆర్సీబీ స్కోరు బోర్డు వేగంగా సాగింది. వీరు ఆడుతున్నంత సేపు బెంగళూరు గెలుపు నల్లేరుపై నడకలా అనిపించింది. బంతి తేడాతో ఒకే స్కోరు (104) వద్ద వీరిద్దరు భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ కు చేరారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న దినేశ్ కార్తీక్ (11)ను అర్ష్ దీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. దాంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ సీజన్ లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వచ్చిన ఆర్సీబీ బౌలర్ హేజల్ వుడ్ ఈ మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. హసరంగ రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Preity zinta, Punjab kings, RCB, Royal Challengers Bangalore, Shikhar Dhawan, Virat kohli