మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్టే పై చేయి సాధించింది. సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించిన పంజాబ్ కింగ్స్.. శుక్రవారం రాత్రి బ్రబోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు సజీవంగా నిలుపుకుంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకిగి దిగిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఇది 6వ విజయం కావడం విశేషం. తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీకి సీజన్ లో ఇది 6వ ఓటమి కావడం విశేషం. ప్రస్తుతం ఆజట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ లో ఓడటంతో టాప్ 2లో నిలిచే అవకాశాన్ని ఆర్సీబీ జట్టు మిస్ చేసుకుంది. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా కఠినం చేసుకుంది. ఈ నెల 19న గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది.అయితే.. ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో నల్ల పిల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. RCB జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ మూడో బంతికి మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు.
హర్‌ప్రీత్ మూడు బంతులు వేసిన వెంటనే స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్రార్ బంతి వేయపోతే ఆపాడు. డుప్లెసిస్ ఇలా ఎందుకు చేశాడో అక్కడున్నవారికీ అర్ధం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం అర్ధమైంది. తెల్లటి మచ్చలతో ఉన్న నల్ల పిల్లి సైట్ స్క్రీన్‌పై హాయిగా కూర్చుని ఉంది. అయితే కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి అది వెళ్లిపోయింది. ఇదంతా చూసిన డుప్లెసిస్ కూడా నవ్వు ఆగలేదు. ఈ పిల్లికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయ్.
ఈ నల్లపిల్లే ఆర్సీబీ కొంపముంచింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డుప్లెసిస్ దాన్ని చూడటం వల్లే ఆర్సీబీకి దరిద్రం పట్టుకుందని.. విరాట్ కోహ్లీ కూడా వినూత్న రితీలో ఔటయ్యాడని.. అందుకే మ్యాచ్ చెత్తగా ఓడిపోయిందని క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక, సైట్ స్క్రీన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇది నలుపు రంగులో ఉంటుంది. అయితే టెస్ట్ ఫార్మాట్ లో ఇది తెలుపు రంగులో ఉంటుంది. ఇది బ్యాట్స్‌మన్ బంతిపై దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో ప్రేక్షకులు కూర్చోవడం లేదా నడవడం నిషేధించబడింది. ఇక, ఈ మ్యాచులో పంజాబ్ విజయంతో ప్లే ఆఫ్ రేసు మరింత మజాగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Faf duplessis, IPL 2022, Punjab kings, Royal Challengers Bangalore, VIRAL NEWS