IPL 2022 RCB VS MI ROYAL CHALLENGERS BANGALORE ALL ROUNDER GLENN MAXWELL REPLICATE MOHAMMAD KAIF RUN OUT AT 2003 WORLD CUP SJN
IPL 2022: కైఫ్ రనౌట్ ను గుర్తు చేసిన మ్యాక్స్ వెల్... పాపం తిలక్ వర్మ... అందుకే తొందర వద్దు అనేది...
మ్యాక్స్ వెల్ రనౌట్ చేస్తున్న దృశ్యం (PC: TWITTER)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Maxwell) గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. గత నెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్ ను పెళ్లి చేసుకున్న మ్యాక్స్ వెల్... ఐపీఎల్ లో ఆర్సీబీ ఆడిన తొలి మూడు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Maxwell) గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. గత నెలలో భారత సంతతికి చెందిన వినీ రామన్ ను పెళ్లి చేసుకున్న మ్యాక్స్ వెల్... ఐపీఎల్ లో ఆర్సీబీ ఆడిన తొలి మూడు మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే ముంబై ఇండిన్స్ (Mumbai Indians)తో శనివారం జరిగిన మ్యాచ్ ద్వారా సీజన్ లో అడుగు పెట్టిన మ్యాక్సీ... మెరిశాడు. బ్యాటింగ్ లో మెరవడానికి పెద్దగా అవకాశం రాకపోయినా... తన ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతోన్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Verma) ముంబై తరఫున అదరగొడుతున్నాడు. గత మూడు మ్యాచ్ ల్లోనూ సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిన తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో కూడా దంచి కొట్టేలా కనిపించాడు.
అయితే తన తొందరపాటు నిర్ణయానికి తోడు... మ్యాక్స్ వెల్ సూపర్ ఫీల్డింగ్ కారణంగా రనౌట్ అయ్యాడు. ఆకాశ్ దీప్ వేసిన 10వ ఓవర్ లో కవర్స్ దిశలో షాట్ ఆడిన తిలక్ వర్మ కష్టమైన పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న మ్యాక్స్ వెల్... సూపర్ వేగంతో బంతిని అందుకుని గాల్లో డైవ్ చేస్తూ వికెట్లను నేరుగా గిరాటేశాడు. దాంతో తిలక్ వర్మ ఖాతా తెరవకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ తొందరగా అవుటవ్వడం ముంబై ఇండియన్స్ స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. అదే సమయంలో తిలక్ వర్మ రనౌట్ ద్వారా మ్యాక్స్ వెల్ భారత ఫీల్డర్ మొహమ్మద్ కైఫ్ ను గుర్తు చేశాడు. 2003 ప్రపంచకప్ లో కూడా కైఫ్ అచ్చం మ్యాక్స్ వెల్ లానే డైవ్ చేస్తూ ఇంగ్లండ్ ఓపెనర్ నిక్ నైట్ ను రనౌట్ చేశాడు. నిక్ నైట్ కూడా లెఫ్టాండెడ్ అవ్వడం... అతడు కూడా తిలక్ వర్మ లానే కవర్స్ లోకి ఆడటం అన్నీ అచ్చు గుద్దినట్లు జరిగాయి. ఈ రెండు రనౌట్లను మీరు కూడా చూసేయండి మరీ...
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ చివర్లో బ్యాటింగ్ కు వచ్చి 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ( 37 బంతుల్లో 68 పరుగులు ; 5 ఫోర్లు,6 సిక్సర్లు ) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేజింగ్ కు దిగిన బెంగళూరు టీం 18.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసి గెలుపొందింది. అనూజ్ రావత్ ( 47 బంతుల్లో 66 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 36 బంతుల్లో 48 పరుగులు ; 5 ఫోర్లు) రాణించాడు. సీజన్ లో బెంగళూరుకు ఇది హ్యాట్రిక్ విజయం కాగా... ముంబై జట్టుకు వరుసగా నాలుగో పరాజయం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.