IPL 2022 - RCB vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) భారీ స్కోరును సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లక్నో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయినా బెంగళూరుకు భారీ స్కోరును అందిచండంతో కీలక పాత్ర పోషించాడు. అయితే చివరి ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. దాంతో ఐపీఎల్ లో తొలి సెంచరీని చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. జేసన్ హోల్డర్, దుష్మంత చమీర చెరో రెండు వికెట్లు తీశారు.
విరాట్ డకౌట్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును తన తొలి ఓవర్ తో దుష్మంత చమీర ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి ఓవర్ లో అనుజ్ రావత్ (4) వికెట్ తో పాటు విరాట్ కోహ్లీ (0) వికెట్లను తీశాడు. విరాట్ కోహ్లీ మరీ ఘోరంగా ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ గా వెనుదిరిగి అటు తన ఫ్యాన్స్ ను ఇటు బెంగళూరు అభిమానులను నిరాశ పరిచాడు. అయితే క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ తనదైన శైలిలో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డు ప్లెసిస్ స్ట్రయిక్ రొటేట్ చేయగా మ్యాక్స్ వెల్ బౌండరీలతో హోరెత్తించాడు. అయితే పాండ్యా బౌలింగ్ లో స్విచ్ హిట్ కు ప్రయత్నించిన మ్యాక్స్ వెల్ హోల్డర్ పట్టిన అద్భుత క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. అనంతరం వచ్చిన ప్రభుదేశాయ్ కూడా వెంటనే అవుటయ్యాడు. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్న డు ప్లెసిస్ చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మరో ఎండ్ లో ఉన్న షాబాజ్ అహ్మద్ (26) కూడా ఆడటంతో స్కోరు బోర్డు వంద దాటింది. అయితే షాబాజ్ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ ఒక సిక్సర్ బాదాడు. అయితే గత మ్యాచ్ ల్లో లాగా భారీ షాట్లతో విరుచుకుపడలేకపోయాడు. ఇక చివరి ఓవర్ ను వేసిన హోల్డర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి డు ప్లెసిస్ వికెట్ తీశాడు. దాంతో సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో డు ప్లెసిస్ నిలిచిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Virat kohli