ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో ఆర్సీబీ రెచ్చిపోయింది. పుణె స్టేడియం వేదికగా చెన్నై తో జరిగిన పోరులో బెంగళూరు 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసింది. ఈ విక్టరీతో ఆర్సీబీ 12 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే, ఈ ఓటమితో చెన్నై అవకాశాలు మరింత సన్నగిల్లాయ్. చెన్నై బ్యాటర్లలో డేవాన్ కాన్వే (37 బంతుల్లో 56 పరుగులు ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మొయిన్ అలీ ( 27 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. గ్లెన్ మ్యాక్స్ వెల్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.174 పరుగుల ఫైటింగ్ టోటల్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మరోసారి అదిరిపోయే ఆరంభం అందించారు. ఈ ఇద్దరూ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించినా.. ఆ తర్వాత దూకుడు పెంచారు. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని షాబాజ్ అహ్మద్ విడదీశాడు.
23 బంతుల్లో 28 పరుగులు చేసిన రుతురాజ్.. షాబాజ్ బౌలింగ్ లో ప్రభుదేశాయ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప (1) కూడా నిరాశపర్చాడు. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ప్రభుదేశాయ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది చెన్నై. ఆ తర్వాత పది పరుగులు చేసిన రాయుడ్ని కూడా పెవిలియన్ బాట పట్టించాడు మ్యాక్సీ. దీంతో, 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ధోనిసేన. అయితే, వికెట్లు పడుతున్నా.. డేవాన్ కాన్వే మాత్రం క్లాసీ షాట్లతో అలరించాడు.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవాన్ కాన్వేకి వరుసగా ఇది రెండో హాఫ్ సెంచరీ. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న కాన్వేని హసరంగ బోల్తా కొట్టించాడు. 56 పరుగులు చేసిన కాన్వే హసరంగ బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతున్న జడేజా మరోసారి నిరాశపర్చాడు.
మూడు పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక, ఆఖర్లో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో చెన్నై బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో, ఆఖరి మూడు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఒత్తిడిలో పడ్డ మొయిన్ అలీ(34), ధోని (2) వెంటనే వెంటనే ఔటవ్వడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది.
ఇక, అంతకు ముందు ..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రర్ (27 బంతుల్లో 42 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (22 బంతుల్లో 38 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్), దినేష్ కార్తీక్ (17 బంతుల్లో 26 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మొయిన్ అలీ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, Faf duplessis, IPL 2022, MS Dhoni, Royal Challengers Bangalore, Virat kohli