పుణె ఎంసీఏ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రర్ (27 బంతుల్లో 42 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (22 బంతుల్లో 38 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్), దినేష్ కార్తీక్ (17 బంతుల్లో 26 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మొయిన్ అలీ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆ జట్టు ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభం అందించారు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడితే.. విరాట్ కోహ్లీ అతనికి సహకరించాడు. ఈ క్రమంలో మొదటి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఫాఫ్ డుప్లెసిస్ జోరుకు మొయిన్ అలీ బ్రేకులు వేశాడు.
22 బంతుల్లో 38 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన డుప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. ఫాఫ్ ఔటైన తర్వాత వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ. మూడు పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. 33 బంతుల్లో 30 పరుగులు చేసిన కోహ్లీ మొయిన్ అలీ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో.. 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే.. ఆ తర్వాత యంగ్ ప్లేయర్లు రజత్ పాటిదార్, మహీ పాల్ లోమ్రర్ కాసేపు వికెట్ల పతనాన్ని ఆడుకున్నారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, రజత్ పాటిదార్(21) రూపంలో ఆర్‌సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిటోరియస్ బౌలింగ్‌లో ముకేశ్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో, 123 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఆఖర్లో మహీష్ తీక్షణ తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. 19 వ ఓవర్ లో మూడు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ కొట్టాడు. మహీ పాల్ లోమ్రర్ 42 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆ వెంటనే వానిందు హసరంగ డకౌటయ్యాడు. ఇక.. ఆ ఓవర్ చివరి బంతికి షాబాజ్ నదీమ్ ఒక పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. ఆఖరి ఓవర్ లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఇక, ముఖాముఖి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కు తిరుగులేదు. ఇరు జట్ల మధ్య 29 మ్యాచులు జరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ 19 గేమ్స్ లో విజయ దుందుభి మోగించింది. ఆర్సీబీ కేవలం 9 మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది. మరో.. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.
తుది జట్లు :
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్-వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Dinesh Karthik, Faf duplessis, IPL 2022, MS Dhoni, Royal Challengers Bangalore, Virat kohli