అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ సాధారణ స్కోరుకు పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (42 బంతుల్లో 58 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (13 బంతుల్లో 24 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, మెకాయ్ చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు. అశ్విన్, బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.డూ ఆర్ డై ఫైట్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపర్చాడు. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత వచ్చిన గత మ్యాచ్ హీరో రజత్ పాటిదార్.. కెప్టెన్ డుప్లెసిస్ తో కలిసి నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
మరో ఎండ్ లో ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేయడానికే నానా తంటాలు పడ్డాడు. టెస్ట్ తరహాలో జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు ఫాఫ్. ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇక, పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డ డుప్లెసిస్ 11 ఓవర్లో పెలివియన్‌కు చేరాడు. ఒబెద్ మెకాయ్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి తన వ్యక్తిగత స్కోరు 25 వద్ద డుప్లెసిస్ ఔట్ అయ్యాడు. దీంతో.. 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మ్యాక్సీ రావడం రావడంతోనే మెరుపు బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్ తో విరుచుకపడ్డాడు.
అయితే, ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్ వెల్ ని.. పెవిలియన్ కు పంపాడు బౌల్ట్. అతని బౌలింగ్ లో మెకాయ్ క్యాచ్ పట్టడం ద్వారా మాక్సీ (24) వికెట్ సమర్పించుకున్నాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా. .మరో ఎండ్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు పాటిదార్. ఈ క్రమంలో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లోనే పాటిదార్ హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత 58 పరుగులు చేసిన పాటిదార్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో..130 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మహీపాల్ లోమ్రర్ (8) కూడా మెకాయ్ ఔలింగ్ లో ఔటై నిరాశపర్చాడు. ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. దినేశ్ కార్తీక్ (6), హసరంగ (0) ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో.. సాధారణ స్కోరుకే పరిమితమైంది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ముఖాముఖి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే పై చేయి. ఆడిన 24 మ్యాచుల్లో ఆర్సీబీ 13 గేమ్స్ లో విక్టరీ సాధించింది. ఇక, రాజస్థాన్ 11 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.