IPL 2022 NEW TEAMS AGENCY THAT REPRESENTED DHONI IN RACE FOR NEW IPL TEAM REPOTS JNK
MS Dhoni - IPL team: ఐపీఎల్లో కొత్త జట్టు కోసం బిడ్ వేసిన ఎంఎస్ ధోని సంస్థ.. టెండర్ గెలిస్తే సీఎస్కేకు గుడ్ బై
ఐపీఎల్లో కొత్త జట్టు కోసం పోటీలో ధోనీ సంస్థ (PC: IPL)
MS Dhoni - New IPL Team: టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే దుబాయ్‌లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతున్నది. ఐపీఎల్లో రెండు కొత్త జట్ల కోసం ఇవాళ టెండర్లు ఓపెన్ చేయనున్నారు. సీఎస్కే కెప్టెన్, టీమ్ ఇండియా మెంటార్ ఎంఎస్ ధోనీకి చెందిన సంస్థ కొత్త జట్టు కోసం టెండర్ వేస్తున్నది. ఇప్పుడు ఈ విషయంపైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
ఒకవైపు టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జరుగుతున్న సమయంలోనే దుబాయ్ వేదికగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 (IPL) సీజన్ నుంచి కొత్తగా మరో రెండు జట్లు లీగ్‌లో చేర్చనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను బీసీసీఐ (BCCI) రెండు నెలల క్రితమే ప్రారంభించింది. కాగా సోమవారం ఈ టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు దుబాయ్ వేదికగా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల, కటక్, ఇండోర్ కేంద్రాలుగా రెండు కొత్త జట్లు రానున్నాయి. రెండు జట్ల కోసం 22 సంస్థలు ఆసక్తి చూపించగా.. 10 మంది మాత్రమే బిడ్లు వేసినట్లు తెలుస్తున్నది. అదానీ గ్రూప్ (Adani Group) ప్రముఖ ఫార్మా కంపెనీ టొరెంటోతో కలసి జాయింట్ కన్సార్టియంగా బిడ్ వేసింది. దీంతో పాటు సంజీవ్ గోయాంక-ఆర్పీఎస్జీ గ్రూప్, నవీన్ జిందాల్ యజమానిగా ఉన్న జిందాల్ స్టీల్ కటక్ ఫ్రాంచైజీ కొరకు, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్లు, సీవీసీ కేపిటల్, కాప్రి గ్లోబల్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
ఇక్కడ అందరినీ ఆకర్షిస్తున్న విషయం.. రిథి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (Rhiti Sports Management) కూడా కొత్త జట్టు కోసం బిడ్ వేయడం. ఎందుకంటే ఇది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ ఎంఎస్ ధోనికి (MS Dhoni) సంబంధించిన సంస్థ. రిథి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ధోనీ-సాక్షికి మెజార్టీ వాటా ఉన్నది. అయితే గతంలో అమ్రపాలి వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన తర్వాత ధోనీ-సాక్షి డైరెక్టర్లుగా వైదొలగారు. కానీ కంపెనీలో భాగస్వామ్యం మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ.. మరో రెండు సంస్థలతో కలసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ వేసినట్లు తెలుస్తున్నది. లక్నో కేంద్రంగా ఈ సంస్థ కొత్త జట్టును కొనుగోలు చేయాలని భావిస్తున్నది. అయితే లక్నో కోసం సంజీవ్ గోయెంకా-ఆర్పీఎస్జీ గట్టిగా పోటీ పడుతున్నది.
ఐపీఎల్లో ధోనీ అంటే అందరికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గుర్తుకు వస్తుంది. పేరుకు కెప్టెనే అయినా సీఎస్కే యాజమాన్యానికి ధోనీ అంతే అపారమైన నమ్మకం. చెన్నై సూపర్ కింగ్స్ మాతృ సంస్థ అయిన ఇండియన్ సిమెంట్స్‌లో ధోనీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. గత రెండు సీజన్లుగా ధోనీ రిటైర్ అవుతాడని వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే విషయం ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత ధోనీని ప్రశ్నించగా.. తాను ఆటగాడిగా లేకపోయినా ఎల్లో జెర్సీలో మాత్రం సీఎస్కే వెంటే ఉంటానని వ్యాఖ్యానించాడు. అయితే ధోనీ ఆ మాట అని 10 రోజులు గడవక ముందే అతడి సంస్థ కొత్త జట్టు కోసం పోటీలో నిలవడం గమనార్హం. కాగా, రిథి స్పోర్ట్స్ కనుక టెండర్ గెలిస్తే ధోనీ ఇక సీఎస్కే తరపున ఆడటం లేదా ఆ జట్టుతో ఉండటం కష్టమే అని తెలుస్తున్నది.
ప్రస్తుతం దుబాయ్‌లో ఐపీఎల్ కొత్త జట్ల బిడ్డింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. ప్రస్తుతం ఆయా సంస్థల టెక్నికల్ బిడ్లు తెరుస్తున్నారు. అందులో అర్హత సాధిస్తేనే తర్వాత జరిగే ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. టెక్నికల్ బిడ్లలో విఫలమైన సంస్థల ఫైనాన్షియల్ బిడ్లను పక్కకు తీసేస్తారు. కాగా, ఈ రోజే కొత్త జట్ల ఎంపిక జరిగినా.. వాటి వివరాలను బీసీసీఐ ప్రకటిస్తుందా లేదా అనేది అనుమానమే.ఐ
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.