IPL 2022 MUMBAI INDIANS YOUNG PLAYER TILAK VARMA FUNNY PRANK ON TIM DAVID DEWALD BREVIS AND RILEY MERIDITH GOES VIRAL WATCH SRD
Viral Video : అట్లుంటది తెలుగు బిడ్డతోని.. తిలక్ స్కెచ్ కి అడ్డంగా బుక్కైన బేబీ ఏబీడీ, టిమ్ డేవిడ్..
Photo Credit : Instagram
Viral Video : తిలక్ వర్మకు ఐపీఎల్ లో ఇదే తొలి సీజన్ అయినా అపార అనుభవం ఉన్న ప్లేయర్ లా ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ పంపినా నిలకడ ప్రదర్శిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) దారుణంగా విఫలమవుతోంది. ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో ఎనిమిదింటిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ (kieron Pollard) లాంటి ధనాధన్ బ్యాటర్లు ఆ జట్టు సొంతం.. అయినప్పటికీ బ్యాటింగ్ లో చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది. ఇక బౌలింగ్ లో బుమ్రా మినహా మిగిలిన వారు పెద్దగా రాణించడం లేదు. అయితే ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో ముంబై జట్టు కొనుగోలు చేసిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (Tilak Verma) మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ నిలకడైన ఆటతీరుతో ఆ జట్టు పరువును కాపాడుతున్నాడు.తాజా ఎడిషన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇక ఆట విషయాన్ని పక్కన పెడితే.. సహచర ఆటగాళ్లతో ఇట్టే కలిసిపోయే స్వభావం తిలక్ వర్మది. ముంబై ఇండియన్స్ జట్టులోని యువ ఆటగాళ్లు ముఖ్యంగా దక్షిణాఫ్రికా సంచలనం, జూనియర్ ఏబీడీగా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్‌తో తిలక్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తిలక్‌కు సంబంధించిన ప్రాంక్ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ‘పేస్ట్ బిస్కట్’తో బ్రెవిస్, రిలే మెరెడిత్, టిమ్ డేవిడ్‌ను ఆటపట్టించాడు. అసలేం జరిగిందంటే.. ముందుగా బిస్కట్లలో క్రీమ్ తీసేసిన తిలక్ వర్మ.. దానికి బదులు అందులో పేస్ట్‌ను పూశాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వాటిని ప్యాక్ చేసి.. మెల్లగా సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లాడు. తన చేతిలోని బిస్కట్లు తినమంటూ వారికి ఆఫర్ చేశాడు.
పాపం తిలక్ ‘స్కెచ్’ గురించి తెలియని డేవిడ్, బ్రెవిస్, మెరెడిత్ ఎంచక్కా వాటిని లాగించేశారు. రుచి కాస్త భిన్నంగా ఉన్నా పర్లేదులే అనుకుంటూ తినేశారు. అయితే, ఆఖర్లో అసలు విషయాన్ని బయటపెట్టాడు క్రేజీ తిలక్. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. పర్లేదు ఇది మింట్ ఫ్లేవర్ బిస్కట్ అనుకున్నా. ఏదమైనా దంతాలకు ఇది మంచిదేగా అంటూ డేవిడ్, మెరెడిత్ నవ్వుతూ వ్యాఖ్యానించడం విశేషం.
ఈ ప్రాంక్ వీడియోను ముంబై తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
తిలక్ వర్మకు ఐపీఎల్ లో ఇదే తొలి సీజన్ అయినా అపార అనుభవం ఉన్న ప్లేయర్ లా ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ పంపినా నిలకడ ప్రదర్శిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా తిలక్ వర్మే ఉండటం విశేషం. ప్రస్తుతం 307 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు తెలుగు తేజం.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.