IPL 2022 MUMBAI INDIANS SKIPPER ROHIT SHARMA PREDICTS TILAK VARMA WII BE SELECTED FOR TEAM INDIA IN THREE FORMATS SOON SRD
Rohit Sharma : అరె హొ సాంబ రాసుకో.. ఈ కుర్రాడు త్వరలో టీమిండియాకు ఆడతాడు.. జోస్యం చెప్పిన రోహిత్..!
Rohit Sharma
Rohit Sharma : : కుర్రాళ్లను ప్రోత్సాహించడంలో ముంబై ఇండియన్స్ ముందుంటుంది. ఆ ప్రోత్సాహనికి తగ్గట్టుగా రాణించేది కొందరు మాత్రమే. ఇప్పటికే ముంబై జట్టు ద్వారా జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి వారు టీమిండియాకు ఎంపికయ్యారు.
ఐపీఎల్ 2022 (IPL 2022)లో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఈ ఏడాది నిరాశపరిచింది. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ముంబై కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగా, మిగిలిన 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్ లో ముంబై ఆటతీరు ఇబ్బందికరంగా ఉన్నా.. 19 ఏళ్ల తిలక్ వర్మ (Tilak Varma) ఆట మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. తిలక్ వర్మ ఐపీఎల్ 2022 సీజన్లో మరోసారి మెరిశాడు. గురువారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్య చేధనలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ 34 పరుగులు నాటౌట్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశాడు. తిలక్ వర్మ అండతో ఆఖర్లో టిమ్ డేవిడ్ రెండు సిక్సర్లతో 16 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మెగా వేలంలో తిలక్ వర్మ ను పోటీ పడీ మరీ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 1.7 కోట్లను వెచ్చించింది. అందుకు తగ్గ న్యాయం చేస్తున్నాడు తిలక్. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట అతడే ఒక సైన్యంలా చెలరేగుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసింది మనోడే.
ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచుల్లో 368 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. 27 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. యావరేజ్ 40.89. స్ట్రైక్ రేట్ 132.85. ఈ గణంకాలు చాలు తిలక్ ప్రతిభ ఏంటో చెప్పడానికి. ప్రతి మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ తిలక్ వర్మ రాణిస్తూనే ఉన్నాడు. ముంబై స్టార్ ఆటగాళ్లు చతికిల పడుతుంటే.. తిలక్ వర్మ మాత్రం ముంబై పోరాటంలో తన పటిమను చూపిస్తూనే ఉన్నాడు.
వయసు చిన్నదైనా పరిణతి ఉన్న ఆటగాడిగా అతను కనబరుస్తున్న ప్రదర్శన గమనించదగ్గది. బౌండరీలు బాదడంలోనూ తిలక్ మంచి దిట్ట. ముఖ్యంగా తిలక్‌లో నచ్చేదేంటంటే.. పోరాటం. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బౌలర్లు తమ పదునైన తెలివైన బంతులతో బురిడి కొట్టించాలని చూస్తున్నా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ పోరాడుతుంటాడు.
అవతలి ఎండ్‌లో ఉండే క్రికెటర్‌తో మంచి సమన్వయం చేసుకుంటాడు. మూడు సార్లు రనౌట్ అయినా.. ఏమాత్రం తన నిరాశపడకుండా అవతల ఉన్న క్రికెటర్ కావాలని చేసింది కాదు కదా అనే క్రీడా స్ఫూర్తితో మౌనంగా క్రీజు వీడి పెవిలియన్‌కు వెళ్లిపోతాడు. అతను ముంబై ఇండియన్స్‌కు దొరికిన ఆణిముత్యమనే చెప్పాలి.
దీంతో.. ఈ యంగ్ గన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, మ్యాచ్ విజయం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ''తిలక్ వర్మ ఒక బ్రిలియంట్. ఆడుతున్న తొలి సీజన్లోనే ఇంతలా రాణించడం గొప్ప విషయం. కచ్చితంగా టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో అతను ఆడతాడనే నమ్మకం ఉంది. అతని టెక్నిక్, ఆత్మవిశ్వాసం, టెంపర్లెస్ అతన్ని ఉన్నతస్థాయి ఆటగాడిగా నిలబెడతాయి. అతనికి మంచి భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పగలను. ఇక ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికి.. విజయాలతో సీజన్‌ను ముగించాలనుకుంటున్నాం. జట్టులో కొత్త ఆటగాళ్లను పరిశీలిస్తాం.. జట్టుకు ఆడాల్సినవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికి అవకాశం వచ్చేలా చూస్తాం. అంటూ'' చెప్పుకొచ్చాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.