హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - MI vs RR : తెలుగు బిడ్డ తిలక్ సూపర్ ఇన్నింగ్స్ వృధా.. రాజస్థాన్ దే విక్టరీ..

IPL 2022 - MI vs RR : తెలుగు బిడ్డ తిలక్ సూపర్ ఇన్నింగ్స్ వృధా.. రాజస్థాన్ దే విక్టరీ..

Tilak Varma

Tilak Varma

IPL 2022 - MI vs RR : తెలుగు బిడ్డ తిలక్ వర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ కు వృధా అయింది. రాజస్థాన్ కంచుకోటను ముంబై బద్దలు కొట్టలేకపోయింది.

డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ కు ఓటమి తప్పలేదు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (33 బంతుల్లో 61 పరుగులు ; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ కు ఈ సీజన్ లో ఇది రెండో విక్టరీ కాగా.. ముంబై ఇండియన్స్ కు రెండో ఓటమి. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 54 పరుగులు) రాణించాడు. యుజువేంద్ర చాహాల్, నవదీప్ షైనీ రెండు వికెట్లతో సత్తా చాటారు.194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే షాక్‌ తగిలింది. 10 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో, 15 పరుగులకే ఫస్ట్ వికెట్ కోల్పోయింది.

భారీ లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్‌కు నాలుగో ఓవర్‌లోనే మరో షాక్‌ తగిలింది. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌(5) పరుగులు చేసి నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో, 40 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది రోహిత్ సేన. అయితే, ఆ తర్వాత ఇషాన్ కిషన్ తో కలిసిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మంచి భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ ఇద్దరు చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డు ప్రెజర్ లేకుండా చూసుకున్నారు.

ముఖ్యంగా తిలక్ వర్మ తనదైన క్లాస్ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే భారీ షాట్ ఆటడానికి ప్రయత్నించిన ఇషాన్ కిషన్.. బౌల్ట్ బౌలింగ్ లో బౌండరీ మీద నవదీప్ షైనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, మూడో వికెట్ కు 81 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తిలక్ వర్మ 28 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత భారీ షాట్లకు ఆడటానికి ప్రయత్నించిన తిలక్ వర్మ 61 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ ఔటయ్యాడు.

తిలక్ వర్మ ఔటవ్వడంతో ముంబై మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. టిమ్ డేవిడ్ (1), డానియల్ సామ్స్(0) ను వరుస బంతుల్లో పెవిలియన్ బాట పట్టించాడు చాహల్. ఆ తర్వాత విండీస్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరుగులకే చేయడానికి నానా తంటాలు పడ్డాడు. దీంతో, ముంబై ఇండియన్స్ ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్ ఓడి రాజస్థాన్ రాయల్స్ రాజసం అంటే ఏంటో చూపించింది. జాస్ బట్లర్ మాస్ బాదుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది రాజస్థాన్ రాయల్స్. జాస్ బట్లర్ (68 బంతుల్లో 100 పరుగులు ; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), హెట్ మేయర్ (14 బంతుల్లో 35 పరుగులు ; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్ ( 21 బంతుల్లో 30 పరుగులు ; 1 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ఈ విధ్వంసంలో కూడా జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. టైల్ మిల్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

First published:

Tags: IPL 2022, Mumbai Indians, Rajasthan Royals, Rohit sharma, Sanju Samson

ఉత్తమ కథలు