IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ()లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan kishan) పడరాని పాట్లు పడుతూనే ఉన్నాడు. ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో ఎవరూ ఊహించని విధంగా రూ.15.25 కోట్లు పలికిన ఈ ఆటగాడు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపించిన ఇషాన్.. అనంతరం చెత్త ప్రదర్శనతో ముంబై ఫ్యాన్స్ చేత చివాట్లు తింటున్నాడు. ఇక ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో అయితే క్రీజులో ఉన్నంత సేపు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 20 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఇది కూడా చదవండి : వేలంలో 10 కోట్లకు పైగా పలికారు.. ఓనర్లను నిండా ముంచారు.. పాపం ఆ జట్ల పరిస్థితి
అయితే మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుటైన తీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ’పాపం ఇషాన్ కిషన్ కు ఎంత కష్టమొచ్చింది.. ఆఖరికి బంతి కూడా అతడి మాట వినడం లేదు‘ అని అంటున్నారు ఫ్యాన్స్. రవి బిష్ణోయ్ 8వ ఓవర్ వేయడానికి రాగా తొలి బంతికి వేసిన గూగ్లీ ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వెళ్లింది. అయితే ఇషాన్ కిషన్ ఆ బంతిని వెంటాడాడు. బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని.. కీపర్ క్వింటన్ డికాక్ బూట్ పై బౌన్స్ అయ్యి స్లిప్ లో ఉన్న హోల్డర్ చేతికి చిక్కింది. అస్సలు ఐపీఎల్ లో ఈ విధంగా ఒక బ్యాటర్ అవుటవ్వడం ఇదే తొలిసారి. ఇషాన కిషన్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో అవుటవ్వడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.
Unlucky Ishan Kishan pic.twitter.com/QsI9KowDlq
— Big Cric Fan (@cric_big_fan) April 24, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దాంతో సీజన్ లో ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లోనూ ఓడి ప్లే ఆఫ్స్ కు దూరమైంది. 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో.. 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ (31 బంతుల్లో 39 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్), తిలక్ వర్మ (27 బంతుల్లో 38 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. జాసన్ హోల్డర్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 102 పరుగులు నాటౌట్ ; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి తన ఫేవరెట్ జట్టు మీద చెలరేగాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీశ్ పాండే (22 బంతుల్లో 22 పరుగులు ; 1 సిక్సర్) రాణించాడు. ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.