ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ముంబైతో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగులతో విజయాన్ని అందుకుంది. 200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (27 బంతుల్లో 37 పరుగులు ; 3 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ఇక, లక్నోకి ఇది నాలుగో విజయం. దీంతో, 8 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇక, ముంబై ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపర్చాడు.కెప్టెన్ రోహిత్ శర్మ (7 బంతుల్లో 6; ఫోర్) ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 16 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది ముంబై.
రోహిత్ ఔట్ అయిన తర్వాత బరిలోకి దిగిన డెవాల్డ్ బ్రెవిస్ మరోసారి తన స్టామినా ఏంటో చూపాడు. ఈ నునుగు మీసాల కుర్రాడు బంతిని బౌండరీలు దాటిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, దూకుడు మీదున్న బ్రెవిస్ జోరుకు ఆవేశ్ ఖాన్ బ్రేకులు వేశాడు. 13 బంతుల్లో 31 పరుగులు చేసిన డెవాల్డ్.. దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా ముంబై 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టోయినిస్ వేసిన 7వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో, ముంబై 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అయితే, ముంబై ఇన్నింగ్స్ ను సూర్య, తిలక్ వర్మ ఆదుకున్నాడు.
ఈ ఇద్దరి ఆచితూచి ఆడారు. అయితే, ఇలా నెమ్మదిగా ఆడటంతో రన్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే, 26 పరుగులు చేసిన తిలక్ ను ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు హోల్డర్. ఆ తర్వాత 37 పరుగులు చేసిన సూర్య కూడా రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఔటవ్వడంతో ముంబై మరింత కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన ఫాబియన్ అలన్ (8) పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో చమీరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆఖర్లో పొలార్డ్, జై దేవ్ ఉనాద్కత్ మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది.
అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో లక్నో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 60 బంతుల్లో 103 పరుగులు నాటౌట్ ; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీతో తన జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇది కేఎల్ రాహుల్ కు ఐపీఎల్ లో వందో టీ20 మ్యాచ్. కేఎల్ రాహుల్ తో పాటు మనీశ్ పాండే (29 బంతుల్లో 38; 6 ఫోర్లు), డికాక్ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ముంబై బౌలర్లలో జై దేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లు దక్కించుకోగా.. అలెన్, మురుగన్ అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022, Kieron pollard, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma