ఢిల్లీ ఆశలపై ముంబై నీళ్లు చల్లింది. వాంఖడే వేదికగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (33 బంతుల్లో 37 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ ( 17 బంతుల్లో 21 పరుగులు ; 1 ఫోర్, 1సిక్సర్) మెరుపులు మెరిపించడంతో ఈ సీజన్ ను ముంబై సూపర్ విక్టరీతో ముగించింది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ రేసు బెర్త్ దక్కించుకుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ముంబైకి సపోర్ట్ చేయడం విశేషం. ఈ మ్యాచ్ గెలిచినా ముంబై మాత్రం పదో స్థానంలోనే నిలిచింది.
ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దక్కలేదు. ఇన్నింగ్స్ మొదట్లో ముంబై బ్యాటింగ్ టెస్ట్ ఇన్నింగ్స్ ని తలపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ పరుగులు చేయడానికి నానా తంటాలు పట్టాడు.
ఇక, 25 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 2 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. నోర్జే బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా ముంబై ఇన్నింగ్స్ నిదానంగానే సాగింది. అయితే.. యంగ్ బ్యాటర్ బ్రెవిస్, ఇషాన్ ఒక్కసారిగా గేర్ మార్చారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 72 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది.
48 పరుగుల చేసిన కిషన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత 95 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన బ్రేవిస్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ కూడా డకౌట్ అవ్వాల్సింది. అయితే.. పంత్ రివ్యూకి పోవకపోవడంతో బతికిపోయిన డేవిడ్ ఆ తర్వాత తిలక్ తో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరూ పోటీపడీ మరీ బౌండరీలు బాదారు. దీంతో.. చేయాల్సిన పరుగులు తగ్గాయ్. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనా.. ముంబై మాత్రం తడబడకుండా విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు డూ ఆర్ డై మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రొవెమన్ పావెల్ (34 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. తన అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశాడు. రమణ్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, మార్కండే చెరో వికెట్ దక్కించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2022, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Royal Challengers Bangalore