వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రొవెమన్ పావెల్ (34 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. తన అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశాడు. రమణ్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, మార్కండే చెరో వికెట్ దక్కించుకున్నారు. డూ ఆర్ డై మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే షాక్ తగిలింది. 21 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్.. 5 పరుగులు చేసిన తర్వాత సామ్స్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది పంత్ సేన.
22 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటిల్స్ రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ డకౌటయ్యాడు. ఆ వెంటనే 31 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటిల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన పృథ్వీ షా.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక, 50 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీ ఇన్నింగ్స్ ని పంత్, పావెల్ ఆదుకున్నారు. పంత్ నిదానంగా ఆడితే.. పావెల్ మాత్రం తన హిట్టింగ్ పవరేంటో చూపించాడు. దొరికిన చెత్త బంతిని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డుకు మైలేజ్ ఇచ్చాడు.
ఇక, పంత్ కూడా వీలు చిక్కినప్పుడల్లా వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 50 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రమణ్ దీప్ సింగ్ విడదీశాడు. 39 పరుగులు చేసిన పంత్.. కిషన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 75 పరుగుల పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది.
ఆ తర్వాత కూడా పావెల్ తన జోరు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే.. పావెల్ (43) జోరుకు బుమ్రా బ్రేకులు వేశాడు. పావెల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 143 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ కూడా విఫలమయ్యాడు. 4 పరుగులు చేసి రమణ్ దీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ ఒకటి రెండు షాట్లతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, హృతిక్ సోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Royal Challengers Bangalore