IPL 2022 MAYANK AGARWAL APPOINTED AS PUNJAB KINGS NEW CAPTAIN FOR IPL 2022 SEASON SJN
IPL 2022: కెప్టెన్సీ విషయంలో శిఖర్ ధావన్ కు చుక్కెదురు... ఆ ప్లేయరే పంజాబ్ కెప్టెన్ గా ఎంపిక
పంజాబ్ కింగ్స్ (ఫైల్ ఫోటో)
IPL 2022: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 ఆరంభం కానున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తమ సారథిని ప్రకటించింది. అయితే ఎంతో అనుభవం ఉన్న శిఖర్ ధావన్ ను కాదని వేరే ప్లేయర్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అతడెవరో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి
IPL 2022: 2021లో భారత (India) ప్రధాన క్రికెట్ జట్టు ఇంగ్లండ్ (England) పర్యటనలో ఉండగా... టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక (Srilanka) పర్యటనకు పంపింది బీసీసీఐ. ఆ సమయంలో భారత్... శ్రీలంకతో టి20, వన్డే సిరీస్ లను ఆడగా... జట్టును శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ముందుండి నడిపించాడు. అప్పుడు భారత్ వన్డే సిరీస్ ను నెగ్గి... టి20 సిరీస్ ను కోల్పోయింది. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ (IPL) వేలంలో శిఖర్ ధావన్ ను పంజాబ్ కింగ్స్ (Punjab kings) సొంతం చేసుకుంది. గతేడాది పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (KL rahul) లక్నో సూపర్ జెయింట్స్ కు వెళ్లడంతో... కెప్టెన్ గా శిఖర్ ను నియమిస్తుందని అంతా భావించారు. దానికి కారణం గతంలో అతడు టీమిండియాను నడిపించడమే. అయితే శిఖర్ ధావన్ తో పాటు క్రికెట్ అభిమానులకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది. శిఖర్ ను కాదని వేరే ఆటగాడిని ఐపీఎల్ 2022 కోసం కెప్టెన్ గా నియమించింది. అతడెవరో తెలుసుకోవాలంటే చదవండి
ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ కింగ్స్ తమ సారథిని నియమించుకుంది. కేఎల్ రాహుల్ జట్టును వీడిన తర్వాత ఖాళీ అయిన ఆ ప్లేస్ ను మరో భారత బ్యాటర్ తో భర్తీ చేసింది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (mayank agarwal) ముందుండి నడిపించనున్నాడు. ఈ మేరకు అతడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ పంజాబ్ మేనేజ్ మెంట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. మయాంక్ ను పంజాబ్ కింగ్స్ రూ 14 కోట్లకు రీటెయిన్ చేసుకుంది.
’2018 నుంచి మయాంక్ అగర్వాల్ పంజాబ్ తోనే ఉన్నాడు. అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడు. ఇటీవల ముగిసిన వేలంలో మేము యువకులతో పాటు అనుభవం ఉన్న ప్లేయర్లను దక్కించుకున్నాం. మయాంక్ నాయకత్వంలో ఓ అద్భుత టీంను రూపొందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం‘ అని జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే (Anil kumble) వ్యాఖ్యానించాడు.
’నేను పంజాబ్ కింగ్స్ తో 2018 నుంచి ఉన్నాను. ఇదో అద్భుత టీం. జట్టు సారథ్య బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. జట్టు విజయంలో సారథిగా నా వంతు పాత్ర పోషించేందుకు ఉత్సాహంతో ఉన్నాను‘ అని మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు.
మయాంక్ అగర్వాల్ 2011 సీజన్ ద్వారా ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. అయితే పంజాబ్ కింగ్స్ జట్టుతో చేరిన తర్వాత అతడి ఆటతీరులో మార్పు వచ్చింది. ఓపెనర్ గా రాహుల్ తో ఇన్నింగ్స్ ను ఆరంభిస్తూ అనేక పర్యాయాలు జట్టుకు శుభారంభం చేశాడు. ఇక ఐపీఎల్ లో పంజాబ్ రాత అంత బాగా ఏమీ లేదు. 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (kings xi punjab) పేరుతో యువరాజ్ సింగ్ నాయకత్వంలో అడుగుపెట్టిన ఆ జట్టు.. ఆ ఏడాది సెమీఫైనల్ కు చేరుకుంది. అయితే అనంతరం 2014 ఫైనల్ చేరడం మినహా ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతి సీజన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకు పోటీ పడటం తప్ప ఆ టీం అద్భుతాలు చేసింది చాలా అరుదు. కేఎల్ రాహుల్ నాయకత్వంలోనూ ఆ జట్టు పెద్దగా రాణించలేదు. దాంతో అతడు జట్టును వీడి కొత్త టీం లక్నో చెంత చేరాడు. కొత్త సారథి మయాంక్ అయినా ప్రితీ జింతా కు తొలి ఐపీఎల్ ట్రోఫీని అందిస్తాడో లేదో చూడాలి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.