ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022 News Update) లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో మ్యాచ్ లో ఓటమి పాలైంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో, ఏడు మ్యాచ్‌లల్లో మూడింట్లో ఓడిన లక్నో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది. అయితే, ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు కెప్టెన్ కు భారీ షాక్ తగిలింది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో వారిపై రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 కింద తప్పును అంగీకరించిన రాహుల్ తనకు విధించిన జరిమానాను కూడా అంగీకరించాడు. ఇక, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేఎల్ రాహుల్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా మందలించబడ్డాడు.
అయితే, కేఎల్ రాహుల్ ఏ కారణంతో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనేది ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు. అతను ప్రవర్థన నియమావళిని ఉల్లంఘించాడని మాత్రం స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుడల చేశారు. దీన్ని లెవెల్ 1 అఫెన్స్‌గా అభివర్ణించారు. దీనితో రాహుల్‌పై జరిమానా పడింది. జరిమానా కింద అతనికి రావాల్సిన మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత పడనుంది.
ఇక, ఫీల్డ్ అంపైర్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ ప్రవర్తన కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అతణ్ని మందలింపుతో వదిలిపెట్టారు.టాప్‌గేర్‌లోకి వచ్చిన తరువాత మార్కస్ స్టొయినిస్ అవుట్ అయిన విషయం తెలిసిందే. 182 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో టీం... 18వ ఓవర్ ముగిసే సరికి 148/6గా నిలిచింది. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయం సాధించాలంటే 34 పరుగులు సాధించాలి. క్రీజులో స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినస్ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్సర్), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.
లక్నో విజయం కష్ట సాధ్యంగా ఉన్నా... క్రీజులో భారీ హిట్టర్లు ఉండటంతో రాహుల్ టీం ఇంకా ఆశలు పెట్టుకొనే ఉంది. 19వ ఓవర్ వేయడానికి జాస్ హేజల్ వుడ్ బౌలింగ్ కు రాగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో మార్కస్ స్టొయినస్ ఉన్నాడు. తొలి బంతిని హేజల్ వుడ్ ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వేశాడు. వాస్తవానికి దానిని వైడ్ గా ప్రకటించాలి. కానీ, అంపైర్ క్రిస్ గఫానీ వైడ్ గా ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి : పీవీ సింధు ప్లేయరే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా..ఈ వీడియోనే సాక్ష్యం
ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన స్టొయినస్ అది వైడ్ అంటూ గఫానీకి సైగ చేశాడు. అయితే గఫానీ మాత్రం చలనం లేకుండా ఉన్నాడు. స్టొయినస్ పిచ్ మధ్య వరకు వస్తూ అంపైర్ ను చూస్తూ ’ అది వైడ్ ఎందుకు కాదు అన్నట్లు‘ చూశాడు. ఇక ఆ తర్వాతి బంతిని ఫైన్ లెగ్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నంలో స్టొయినస్ వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్ అయ్యాడు.
దీంతో సహనం కోల్పోయిన అతడు ’F*** YOU‘ అంటూ అరుస్తూ వెళ్లిపోయాడు. ఇది మైక్ స్టంప్ లో క్లియర్ గా రియాక్ట్ అయ్యింది కూడా. అంతకు ముందు బంతిని వైడ్ గా ప్రకటించకపోవడంతో ఏకాగ్రత కోల్పోయిన స్టొయినస్ ఆ తర్వాత బంతికే అవుటయ్యాడు. దాంతో అంపైర్ నే అతడు ఆ పదంతో దూషించాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో, అతని ప్రవర్తన పట్ల మేనేజింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొదటి తప్పుకింద మందలింపుతో స్టొయినిస్ ను వదిలేశారు. కానీ, ఇదే భవిష్యత్తులో రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Faf duplessis, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Royal Challengers Bangalore