హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - LSG vs MI : మరో మ్యాచులో తుస్సుమనిపించిన ముంబై.. లక్నో సూపర్ విక్టరీ..

IPL 2022 - LSG vs MI : మరో మ్యాచులో తుస్సుమనిపించిన ముంబై.. లక్నో సూపర్ విక్టరీ..

Lucknow Super Giants

Lucknow Super Giants

IPL 2022 - LSG vs MI : ఈ సీజన్ లో ముంబై ఓటములకు బ్రేకుల్లేవ్. ఆ జట్టు పరిస్థితి దారుణంగా మారిపోయింది. దీంతో, మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ లో వరుసగా ఎనిమిదో పరాజయాన్ని మూటగట్టుకుంది.169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో.. 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ (31 బంతుల్లో 39 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్), తిలక్ వర్మ (27 బంతుల్లో 38 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. జాసన్ హోల్డర్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఇక, లక్నోకి ఇది ఐదో విజయం. 8 మ్యాచుల్లో మూడు ఓడిపోయి.. ఐదింట్లో నెగ్గి.. 10 పాయింట్లు ఖాతాలో వేసుకుంది రాహుల్ సేన. 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై తమ ఇన్నింగ్స్ తో నిదానంగా ఆరంభించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. అయితే, మరో ఎండ్ లో రోహిత్ శర్మ మాత్రం తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.

కానీ, ఇషాన్ కిషన్ తన జిడ్డు బ్యాటింగ్ తో రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచాడు. 49 ప‌రుగుల వ‌ద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 20 బంతుల్లో 8 ప‌రుగులు చేసిన కిష‌న్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో హోల్డ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు ఇషాన్ టెస్టు బ్యాటింగ్ దెబ్బకి వ‌రుస క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మోషిన్ ఖాన్ బౌలింగ్‌లో బ్రేవిస్‌(3) ఔట్ కాగా..త‌ర్వాతి ఓవ‌ర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ‌(39) ఔట‌య్యాడు. దీంతో 58 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఇక, ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 7 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్.. బ‌దోని బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

దీంతో, 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్ ని మరోసారి తెలుగు తేజం తిలక్ వర్మ ఆదుకున్నాడు. పొలార్డ్ తో కలిసి ముంబై ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో క్లాసీ షాట్లతో అలరించాడు తెలుగు కుర్రాడు. దీంతో, ఐదో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ, చేయాల్సిన నెట్ రన్ రేట్ బాగా పెరిగిపోయింది. దీంతో, ఒత్తిడిలో పడ్డ తిలక్ వర్మ(38) జాసన్ హోల్డర్ బౌలింగ్ లో రవి బిష్ణోయ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, ముంబై ఆశలు నెమ్మదిగా సన్నగిల్లాయ్. ఆఖర్లో కూడా ఎటువంటి అద్భుతం జరగలేదు. ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారు అయింది. దీంతో, మరో చెత్త రికార్డును మూట గట్టుకుంది. వరుసగా 8 సార్లు ఓడిపోయిన టీమ్ గా నిలిచింది.

అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. కేలక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 102 పరుగులు నాటౌట్ ; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి తన ఫేవరెట్ జట్టు మీద చెలరేగాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీశ్ పాండే (22 బంతుల్లో 22 పరుగులు ; 1 సిక్సర్) రాణించాడు. ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

First published:

Tags: Cricket, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma

ఉత్తమ కథలు