LSG vs KKR : 6 బంతులు.. చేయాల్సిన పరుగులు 21. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో చేయాల్సిన పరుగులు. బౌలింగ్ వేయడానికి మార్కస్ స్టొయినస్ సిద్ధమవ్వగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో రింకూ సింగ్ సిద్ధమయ్యాడు. స్లాట్ లో వేసిన తొలి బంతిని ఎక్స్ ట్రా కవర్ లో ఫోర్ బాదాడు రింకూ సింగ్. రెండో బంతిని కూడా రింకూ సింగ్ భారీ సిక్సర్ బాదాడు. ఇక స్టోయినస్ వేసిన మూడో బంతిని లాంగాఫ్ మీదుగా మరో భారీ సిక్సర్ బాదడంతో కేకేఆర్ విజయ సమీకరణం మూడు బంతుల్లో 5 పరుగులుగా మారింది. ఇక నాలుగో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఆడిన రింకూ సింగ్ రెండు పరుగులు తీశాడు. ఫలితంగా కేకేఆర్ చివరి రెండు బంతుల్లో 3 పరుగులు చేస్తే చాలు.
ఐదో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఆఫ్ సైడ్ గాల్లోకి లేచింది. ఎక్కడో బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఎవిన్ లూయిస్ 90 అడుగుల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో అద్భుతమై క్యాచ్ ను అందుకున్నాడు. దాంతో 15 బంతుల్లో 40 పరుగులు చేసిన రింకూ సింగ్ పెలియన్ కు చేరాడు. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో చివరి బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. దాంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టుకు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ తోమర్ (4) వెంట వెంటనే పెవిలియన్ కు చేరారు. ఈ స్థితిలో శ్రేయస్ అయ్యర్ (50), నితీశ్ రాణా (42), స్యామ్ బిల్లింగ్స్ (36) జట్టును ఆదుకున్నారు. అయితే వీరు కీలక సమయంలో అవుటవ్వడంతో జట్టు మరోసారి ట్రబుల్స్ లో పడింది. ఆండ్రీ రస్సెల్ (5) నిరాశ పరిచారు. దాంతో లక్నో ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, సునీల్ నరైన్ (7 బంతుల్లో 21; 3 సిక్సర్లు) లక్నో విజయాన్నిఅడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్ తో లక్నోను వణికించారు. ఈ మ్యాచ్ లో లక్నో గెలిచినా కూడా రింకూ సింగ్ క్రికెట్ లవర్స్ మనసులను గెలుచుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ కావడం విశేషం. క్వింటన్ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) యాంకర్ రోల్ ప్లే చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer