పుణె వేదికగా జరిగిన మ్యాచులో కోల్ కతా దారుణంగా ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచింది. ఈ విజయంతో లక్నో టాప్ ప్లేసుకి చేరుకుంది. 177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 14.3 ఓవర్లలో కేవలం 101 పరుగుల మాత్రమే చేసింది. దీంతో.. ఘోరపరభావాన్ని మూటగట్టుకుని.. ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకుంది. కేకేఆర్ లో రస్సెల్ ( 19 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) , సునీల్ నరైన్ (12 బంతుల్లో 22 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, హోల్డర్ చెరో మూడు వికెట్లతో కోల్ కతా పతనాన్ని శాసించారు.177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కి లక్నో బౌలర్లు చుక్కలు చూపారు. లక్నో పేసర్ బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాటర్లు బెంబెలెత్తిపోయారు. మోహిసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లోనే కేకేఆర్ వికెట్ కోల్పోయింది. అయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి బాబా ఇంద్రజిత్ (0) ఔటయ్యాడు. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌కు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6).. 3.4వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. చమీరా బౌలింగ్‌లో బదోనికి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో, 11 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే హోల్డర్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ (14) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో, కేకేఆర్ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ వేసిన 7వ ఓవర్ ఐదో బంతికి నితీశ్ రాణా (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో, 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అయితే, కష్టాల్లో పడ్డ కోల్ కతా ఇన్నింగ్స్ ను తన మెరుపులతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో కాసేపు లక్నో బౌలర్లకు చెమటలు పట్టించాడు.
అయితే, మరో ఎండ్ లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రింకూ సింగ్ (6).. కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా కేకేఆర్ 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడుతూ కేకేఆర్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేసిన రసెల్ (19 బంతుల్లో 45) ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాటపట్టాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకోవడంతో అనుకూల్ రాయ్ (0) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా కేకేఆర్ 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత జాసన్ హెల్డర్.. ఒకే ఓవర్ లో సునీల్ నరైన్ (22), టిమ్ సౌథీలను వెంట వెంటనే పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి హర్షిత్ రానా రనౌటయ్యాడు. దీంతో..101 పరుగులకు ఆలౌట్ అయింది కేకేఆర్.
అంతకుముందు.. లక్నో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఓ దశలో భారీ స్కోరు దిశగా సాగిన లక్నో ఇన్నింగ్స్.. మిడిల్ ఓవర్లలో తడబడింది. అయితే.. ఆఖర్లో స్టొయినిస్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) , దీపక్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టొయినిస్ (14 బంతుల్లో 28 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సౌథీ, నరైన్, శివమ్ మావీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, Cricket, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Shreyas Iyer