IPL 2022 LIKELY TO BEGIN IN CHENNAI CHEPAUK STADIUM FROM APRIL 2ND REPORT JNK
IPL 2022: ఐపీఎల్ 2022 ఎప్పుడు.. ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? బీసీసీఐ ఫిక్స్ చేయనున్న డేట్, వేదికల వివరాలు ఇవే
ఐపీఎల్ 2022 ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? (PC: IPL)
IPL 2022: ఐపీఎల్ 2022కి బీసీసీఐ రంగం సిద్దం చేస్తున్నది. ఇప్పటికే రెండు కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కొత్త సీజన్ ప్రారంభ తేదీ, వేదికను కూడా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జట్ల యాజమాన్యాలకు సమాచారం పంపింది.
ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ముగిసి 5 వారాలు పూర్తయ్యింది. ఇంతలోనే ఐపీఎల్ 2022కు (IPL 2022) బీసీసీఐ (BCCI) కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఐపీఎల్ 15 సీజన్ కోసం రెండు కొత్త జట్ల ప్రకటన కూడా పూర్తయ్యింది, దీంతో ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. వచ్చే సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉండనున్నట్లు తెలుస్తున్నది. కాగా, మొదటి మ్యాచ్‌కు చెన్నైలోని చేపాక్ క్రికెట్ స్టేడియం వేదిక కానున్నది. సాంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ తొలి మ్యాచ్ వారి హోం గ్రౌండ్లో ఆడుతుంది. కోవిడ్ కారణంగా గత రెండు సీజన్లలో ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ పూర్తి స్థాయిలో ఇండియాలోనే జరుగనుండటంతో ఇదే సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారు. చేపాక్ స్టేడియంలో ఏప్రిల్ 2న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తొలి మ్యాచ్ ఆడనున్నట్లు 'క్రిక్ బజ్' అనే వెబ్సైట్ పేర్కొన్నది. అయితే సీఎస్కే ఎవరితో తలపడుతుందో మాత్రం తెలియడం లేదు.
ఏప్రిల్ 2న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్ 60 రోజుల పాటు నిర్వహిస్తారు. జూన్ తొలి వారంలో ఐపీఎల్ ఫైనల్ ముగుస్తుందని సమాచారం. అయితే ఈ సారి 74 మ్యాచ్‌లు జరుగనుండటంతో సమయం కూడా పెరిగింది. అయితే పాత ఫార్మాట్లోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ రెండు గ్రూపులుగా విభజించి 2010లో ఆడించినట్లుగా లీగ్ నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఏప్రిల్ 2న చెన్నైలో నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించినట్లు ఇప్పటికే సీఎస్కే యాజమాన్యానికి సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా బీసీసీఐ సూచించింది. ఇదే విషయాన్ని మిగిలిన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు కూడా తెలిపినట్లు సమాచారం.
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 20, 2021
ఐపీఎల్ తిరిగి ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ కార్యాదర్శి జై షా ఇప్పటికే ప్రకటించారు. గత శనివారం చెన్నైలో జరిగిన సీఎస్కే చాంపియన్ సెలెబ్రేషన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2020 పూర్తి సీజన్, 2021 రెండో భాగం యూఏఈ వేదికగా నిర్వహించారు. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ నిబంధనలు పూర్తిగా సడలించడంతో ఐపీఎల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని బీసీసీఐ భావిస్తున్నది. తాజాగా న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్ కూడా ప్రేక్షకులను అనుమతించారు. దీంతో ఐపీఎల్ 2022కి ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ భావిస్తున్నది.
ఐపీఎల్ 2022కు ముందు బీసీసీఐ ముందు ఉన్న అతిపెద్ద టాస్క్ మెగా వేలంపాట. ఇప్పటికే అన్ని జట్లకు రిటెన్షన్ పాలసీని బీసీసీఐ తెలియజేసింది. డిసెంబర్ నెలాఖరులోగా ఎవరెవరిని తమతో అట్టిపెట్టుకున్నారో తెలియజేయాలని బీసీసీఐ ఆదేశించింది. జనవరిలో మెగా వేలం జరిగే అవకాశం ఉన్నది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.