IPL Playoffs 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఊహకందని ట్విస్టులతో ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రతి జట్టు కూడా 12 మ్యాచ్ లను పూర్తి చేసుకోగా వచ్చే వారంతో లీగ్ స్టేజ్ కు ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) కూడా దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరినట్లే. ఈ రెండు జట్లకు ఇదే తొలి ఐపీఎల్. అయినప్పటికీ అద్భుత ఆటతీరుతో కదం తొక్కి పాయింట్ల పట్టికలో టాప్ 2లో కొనసాగుతున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా 6 జట్లు (ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్)పోటీలో ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
రాజస్తాన్ రాయల్స్
రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి విజయం దూరంలో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో గ్రూప్ లో మూడో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే.. టాప్ 2లో రాజస్తాన్ నిలవడం ఖాయం. లేదు ఒక్క మ్యాచ్ లో గెలిచినా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక రెండు మ్యాచ్ ల్లోనూ ఓడినా కూడా రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకునే వీలు ఉంటుంది. అయితే అప్పుడు రాజస్తాన్ ప్లే ఆఫ్స్ కు చేరడంలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది. ఆదివారం రాత్రి లక్నోతో రాజస్తాన్ తలపడనుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈ సాల కప్ నమ్ దే అంటూ బరిలోకి దిగడం బొక్క బోర్లా పడటం.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అలవాటుగా మారిపోయింది. ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టడం ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడటం ఈ జట్టుకు తెలిసినంతగా మరే జట్టుకు తెలిసి ఉండు. ఈ సీజన్ లోనూ ఆర్సీబీ కథ అలాగే మారిపోయింది. పంజాబ్ కింగ్స్ తో ఓడటంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రాత పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం ఖాయం. ఓడితే మాత్రం ఆర్సీబీకి చాలా కష్టం. ఎందుకంటే ఆర్సీబీ నెట్ రన్ రేట్ మైనల్ లో ఉంది. కాబట్టి.. గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో గెలవడం తప్ప ఆర్సీబీకి మరో మార్గం లేదు.
పంజాబ్ కింగ్స్
స్టార్ ప్లేయర్స్... పవర్ హిట్టర్స్ ఉన్నా పంజాబ్ కింగ్స్ () తలరాత మారడం లేదు. 2014 సీజన్ లో ఫైనల్ కు చేరడం మినహా.. ఆ జట్టు మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేదు. ఫిబ్రవరి వేలంలో ఆ జట్టు మంచి ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. అయితే సీజన్ ఆరంభం అయ్యాక సమష్టిగా నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమం అవుతూనే ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే పంబాబ్ తన తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ భారీ విజయాలు సాధించాలి. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ ను పంజాబ్ ఢీ కొట్టనుంది. ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో పంజాబ్ ఓడితే ఇక ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు శుభం కార్డు పడినట్లే.
కేకేఆర్
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్ 2022 సీజన్ లో అడుగుపెట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైపై అద్భుత విక్టరీతో బోణీ కొట్టిన కేకేఆర్.. ఆ తర్వాత అదే రీతిన ఆడలేకపోయింది. మ్యాచ్ మ్యాచ్ కు ఆటగాళ్లను మారుస్తూ దిశా నిర్దేశం లేకుండా ఆ జట్టు ఆటతీరు సాగింది. ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో గ్రూప్ లో 6వ స్థానంలో ఉంది. లక్నోతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ను ఆడనుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు కేకేఆర్ 14 పాయింట్లతో ఉంటుంది. అయినప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుందో లేదో తెలుస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.
సన్ రైజర్స్ హైదరాబాద్
ఈ జట్టు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆడిన 12 మ్యాచ్ ల్లో 5 విజయాలు 7 పరాజయాలతో 10 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అధికారికంగా సన్ రైజర్స్ కు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా.. అవి జరగాలంటే దేవుడు దిగిరావాల్సిందే. నాకౌట్ దశకు చేరాలంటే సన్ రైజర్స్ తొలుత తన తన తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించాలి. అనంతరం పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ జట్లు తమ మ్యాచ్ ల్లో భారీ తేడాతో ఓడాలి. అలా జరిగితే అప్పుడు సన్ రైజర్స్, ఆర్సీబీ, రాజస్తాన్ జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. అందులోనూ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. కాబట్టి.. తన తదుపరి రెండు మ్యాచ్ ల్లోనూ హైదరాబద్ జట్టు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఇదంతా జరగేది అనుమానమే. సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్ ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న ముంబైని.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఢీ కొనాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rayudu, Chennai Super Kings, Delhi Capitals, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Kolkata Knight Riders, Lucknow Super Giants, Mumbai Indians, Punjab kings, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli