ఐపీఎల్ 2022 (IPL 2022) లో మరో ఆసక్తిపోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్లో తొలి విజయం కోసం.. పాయింట్ల పట్టికలో టాప్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ చూస్తున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా. కేకేఆర్ రెండు మార్పులతో ఈ మ్యాచులో బరిలోకి దిగుతోంది. టిమ్ సౌథీ స్థానంలో ప్యాట్ కమిన్స్ వస్తే.. శివమ్ మావీ ప్లేసులో రసిక్ సలామ్ వచ్చాడు. ముంబై కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. టిమ్ డేవిడ్ స్థానంలో బేబి డివిలియర్స్ డేవాల్డ్ బ్రెవిస్..అన్మోల్ ప్రీత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబై మీద గెలిస్తే అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఇక, ముంబై ఆడిన రెండు మ్యాచుల్లోనూ చేతులేత్తేసింది.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబైని ఈ సారి బౌలింగ్ విభాగం తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. బుమ్రా, మురుగన్ అశ్విన్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. పేసర్ బాసిల్ థంపి ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ అయితే.. భారీగా పరుగులివ్వడమే కాకుండా.. వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రాకు సహకరించే మరో బౌలర్ లేకపోవడం ముంబైకి మైనస్ గా మారింది.
#KKR have won the toss and they will bowl first against #MumbaiIndians Live - https://t.co/qFLVoCfqRk #KKRvMI #TATAIPL pic.twitter.com/nn7JCyXgKG
— IndianPremierLeague (@IPL) April 6, 2022
బ్యాటింగ్‌లో రోహిత్‌కు కోల్‌కతాపై మంచి రికార్డు ఉంది. రోహిత్ అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. భారీ స్కోరు చేయాల్సి వస్తే ఈ ఇద్దరి ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడంతో ముంబై బ్యాటింగ్ బలోపేతం అయింది. యువకెరటం తిలక్ వర్మ.. అద్భుతంగా రాణిస్తున్నాడు. కీరన్ పొలార్డ్, డేవాల్డ్ బ్రెవిస్ తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. అంతర్జాతీయ టీ-20 లీగ్‌ల్లో సత్తాచాటిన టిమ్.. ఇండియా పిచ్‌లపై రాణించలేకపోతున్నాడు. దీంతో అతని పక్కన పెట్టి ఇతడి స్థానంలో బేబీ ఏబీ- డెవాల్డ్ బ్రేవిస్‌కు ఛాన్సు ఇచ్చింది.
కోల్‌కతా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. ఆండ్రీ రస్సెల్ సరియైన టైంలో ఫాంలోకి రావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 31 బంతుల్లోనే 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది కేకేఆర్.
ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే ఫామ్ కలవరపెడుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ బాగానే ప్రారంభిస్తున్నా.. భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. సామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా కూడా అంతలా రాణించింది లేదు. బౌలింగ్‌లో టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో పర్పుల్ క్యాప్ ఉమేశ్ దగ్గరే ఉంది. ప్యాట్ కమిన్స్ రావడం కేకేఆర్ ప్లస్ పాయింట్. కట్టుదిట్టంగా బంతులు వేసే మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ ఉండనే ఉన్నారు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ టూ హెడ్ రికార్డుల్లో ముంబై పూర్తి అధిపత్యాన్ని కనబర్చింది. రెండు జట్లు ఈ లీగ్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో తలపడగా ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా కేవలం 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డేవాల్డ్ బ్రెవిస్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమాల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి
కేకేఆర్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్, రహానే, నితీశ్ రాణా, బిల్లింగ్స్, , రస్సెల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, రసిక్ సలామ్, వరుణ్ చక్రవర్తి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Rohit sharma, Shreyas Iyer