హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: అక్షరాలా రూ. 12715 కోట్లు.. ఆ రెండు జట్లు లాభాల బాట పట్టేదెన్నడు? కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలకు లాభాలు వస్తాయా?

IPL 2022: అక్షరాలా రూ. 12715 కోట్లు.. ఆ రెండు జట్లు లాభాల బాట పట్టేదెన్నడు? కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలకు లాభాలు వస్తాయా?

ఐపీఎల్ కొత్త జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఆ జట్లు లాభాల బాట పడతాయా?

ఐపీఎల్ కొత్త జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఆ జట్లు లాభాల బాట పడతాయా?

IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి రాబోయే కొత్త జట్లు ఏవో తెలిసిపోయింది. రెండు జట్లకు కలిపి రూ. 12715 కోట్లు బీసీసీఐ ఖజానాలోకి రాబోతున్నాయి. మరి కొత్త ఫ్రాంచైజీలకు అంత మొత్తం తిరిగి ఎలా వస్తుంది? ఆ జట్లు లాభాల బాట పడతాయా?

ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ నుంచి లక్నో, అహ్మదాబాద్ జట్లు లీగ్‌లో చేరనున్నాయి. అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ (CVC Capital) రూ. 5625 కోట్లకు కొనుగోలు చేయగా... లక్నో జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ (RPSG Group) రూ. 7090 కోట్లకు కొన్నది. అంటే ఈ రెండు జట్ల ద్వారా బీసీసీఐ (BCCI) ఖజానాలోకి రూ. 12,715 కోట్లు చేరనున్నాయి. బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీల (New Franchise) కనీస ధర రూ. 2000 కోట్లగా నిర్ణయించింది. అయినా సరే అంతకు మూడు రెట్లు ఎక్కవగానే బిడ్లు దాఖలు చేయడం గమనార్హం. అన్ని వేల కోట్ల రూపాయలను ఐపీఎల్ కోసం వెచ్చించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది. కరోనా కారణంగా అన్ని రకాల వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లకు గత రెండు సీజన్లలో ప్రేక్షకులను పూర్తిగా అనుమతించలేదు. మరి ఇలాంటి సమయంలో అన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఎలా కొనుగోలు చేశారని అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఆ రెండు సంస్థలకు కొత్త ఫ్రాంచైజీల ద్వారా లాభాలు ఎప్పుడు? ఎలా వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బీసీసీఐ రూపొందించిన ఐపీఎల్ బిజినెస్ ఫార్మాట్ చాలా సురక్షితమైనదిగా ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. స్టేడియంలకు వచ్చే ప్రేక్షకుల ద్వారానే ఐపీఎల్ లాభాలు రావు. వాస్తవానికి ప్రేక్షకులు రాని గత రెండు సీజన్లు కూడా ఐపీఎల్ లాభాల్లోనే ఉన్నది. పలు ఫ్రాంచైజీలు గత రెండు సీజన్లలో రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకు లాభాలను పొందారు. బీసీసీఐకి ఐపీఎల్ స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారా వేల కోట్ల రూపాయలు వచ్చి చేరతాయి. ఇందులో 50 శాతం సెంటర్ పూల్ ద్వారా ఆయా ఫ్రాంచైజీలకు పంచి పెడతారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెల్లించాల్సిన ఫీజును మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ఫ్రాంచైజీలకు బదిలీ చేస్తారు. అంటే ఫ్రాంచైజీలు ప్రతీ ఏడాది చెల్లించాల్సిన ఫీజు ఆ మేరకు తగ్గిపోతున్నది.

MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కొత్త టీమ్స్ కోసం బిడ్ వేయడానికి వెళ్లిన ధోనీ మేనేజర్.. తర్వాత ఏం జరిగింది?


ఇక ప్రతీ ఫ్రాంచైజీకి కిట్ స్పాన్సర్ల నుంచి ప్రిన్సిపల్ స్పాన్సర్ల వరకు అనేక రూపాల్లో ఆదాయం లభిస్తున్నది. ఆయా ఫ్రాంచైజీల ప్రదర్శన ద్వారా స్పాన్సర్లు ముందుకు వస్తుంటారు. ఐపీఎల్‌లో అత్యధిక ఆదాయం పొందే ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. ఆ జట్టు వరుసగా టైటిల్స్ సాధిస్తూ ఉండటంతో స్పాన్సర్లు కూడా క్యూ కడుతున్నారు. గత ఏడాది ఆ జట్టు వాల్యూ దాదాపు రూ. 900 కోట్లుగా ఉన్నది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా మంచి లాభాలనే అర్జిస్తున్నది. ధోనీ సారథ్యంలోని ఆ జట్టు మంచి మార్కెట్ వాల్యూ కలిగి ఉన్నది. ఈ ఏడాది పూర్తిగా నిరాశ పరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి లాభాల్లో ఉన్నది. ఈ ఫ్రాంచైజీ ప్రతీ ఏడాది 9 శాతం లాభాలను వృద్ది చేసుకుంటూ వెళ్తున్నది. మిగిలిన ఫ్రాంచైజీలు కూడా బ్రేక్ ఈవెన్‌కు వచ్చాయి. ఏ జట్టు కూడా నష్టాలను పొందక పోవడవ విశేషం.

T20 World Cup: స్కాట్లాండ్ మ్యాచ్‌లో పలు రికార్డులు బ్రేక్ చేసిన అఫ్గానిస్తాన్.. ఒక మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా?


ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్నో జట్టును తీసుకుంటే.. ఆ జట్టును రూ. 7090 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఫ్రాంచైజీ ప్రతీ ఏడాది రూ. 709 కోట్లను బీసీసీఐకి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లేయర్ల కొనుగోలు, రవాణా, వసతి వంటి అతనపు ఖర్చులు ఉంటాయి. సహాయక సిబ్బంది, టీమ్ మేనేజ్‌మెంట్ జీతభత్యాల కోసం భారీగానే చెల్లిపులు చేయాలి. ఎంత లేదన్నా.. ప్రతీ ఏడాది దాదాపు రూ. 1000 కోట్లు లక్నో యాజమాన్యానికి ఖర్చు ఉంటుంది. అంటే ఆ యాజమాన్యం స్పాన్సర్లును భారీ మొత్తాలకు ఏర్పాటు చేసుకోవాలి. అయితే వచ్చే ఏడాది నుంచి టికెట్ ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు. లక్నోలో ఇటీవల భారీ స్టేడియం నిర్మించారు. కాబట్టి ఆ ఆదాయం కూడా బాగానే ఉండే అవకాశం ఉన్నది. ఎంత రాబట్టినా.. రూ. 1000 కోట్లను ప్రతీ ఏడాది జనరేట్ చేయడం లక్నో యాజమాన్యానికి కత్తిమీద సామే అని చెప్పవచ్చు. అయితే 15 ఏళ్ల క్రితం పలు జట్లను రూ. 600 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్య పడ్డారు. కానీ కేవలం 6 నుంచి 8 ఏళ్లలో ఆయా జట్లు లాభాల బాట పట్టాయి.

ఇప్పుడు అదే స్ట్రాటజీతో ఆర్పీఎస్జీ, సీవీసీ క్యాపిటల్ భారీ ధరకు కొత్త జట్లను కొనుగోలు చేశాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగనున్నదని.. వచ్చే ఏడాది బ్రాడ్ కాస్ట్ హక్కులు కూడా అమ్ముడు పోనున్నాయి. వాటికి కనుక మరింత ఎక్కువ ధర వస్తే కొత్త జట్లకు ఆర్థిక కష్టాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కొత్త జట్లు లాభాల బాట పట్టడానికి కనీసం 7 నుంచి 8 ఏళ్ల పడతాయని అంటున్నారు.

First published:

Tags: Bcci, IPL, IPL 2021

ఉత్తమ కథలు