ఐపీఎల్ 2022 సీజన్ లో మరో మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజా అందించింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆఖరికి విజయం ముంబై ని వరించింది. ఆఖరి ఓవర్ లో 9 పరుగులు అవసరమవ్వగా డానియల్ సామ్స్ అద్భుత బౌలింగ్ తో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో.. ముంబై 5 పరుగుల తేడాతో గెలిచింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. హార్దిక్ పాండ్యా ( 14 బంతుల్లో 24 పరుగులు ; 4 ఫోర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. పొలార్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ విక్టరీతో ఈ లీగులో రెండో విజయాన్ని దక్కించుకుంది ముంబై. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందిచారు. శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు ఫస్ట్ వికెట్ కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని జోడించారు. పవర్ ప్లే లో సాహా ముంబై బౌలర్లపై విరుచుకుపడితే.. పవర్ ప్లే తర్వాత గిల్ తన జోరు చూపించాడు. ఈ ఇద్దరి దూకుడు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
బౌలర్ ఎవరైనా సరే తగ్గేదే లే అన్నట్టు ఈ ఇద్దరూ చెలరేగారు. వీరిద్దరి ధాటికి గుజరాత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఈ క్రమంలో సాహా ముందు తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే గిల్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మురుగన్ అశ్విన్ విడదీశాడు. మురుగన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్లో గుజరాత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నంచిన గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు).. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. .
తొలి బంతికి గిల్‌ను పెవిలియన్‌కు పంపిన అశ్విన్.. ఆఖరి బంతికి సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ను కూడా ఔట్ చేశాడు. దీంతో 111 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ ఒకటి, రెండు షాట్లతో అలరించాడు. అయితే.. 14 పరుగులు సాయి సుదర్శన్ పొలార్డ్ బౌలింగ్ లో విచిత్ర రితీలో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో.. 138 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆఖరి 4 ఓవర్లలో 40 పరుగులు అవసరమవ్వగా.. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే.. అనవసరపు రన్ కి యత్నించి కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. ఆఖర్లో డానియల్ సామ్స్ మ్యాజిక్ తో ముంబై రెండో విజయాన్ని దక్కించుకుంది.
అంతకు ముందు ముంబై మంచి ఫైటింగ్ టోటల్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. టిమ్ డేవిడ్ ( 21 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లతో మరో సారి తన మ్యాజిక్ చూపించాడు. జోసెఫ్, సంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్ తలా వికెట్ దక్కించుకున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.