IPL 2022 FIVE TIME CHAMPION MUMBAI INDIANS BAGS WORST RECORD BECOMES 3RD TEAM TO LOSE FIRST SIX MATCHES IN LEAGUE HISTORY SRD
IPL 2022 - Mumbai Indians : బ్యాడ్ టైం బాబు బ్యాడ్ టైం.. ఐదు సార్లు చాంపియన్ ఖాతాలో చెత్త రికార్డు..
Mumbai Indians
IPL 2022 - Mumbai Indians : ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. సీజన్ లో అత్యంత దారుణంగా తయారైంది ముంబై పరిస్థితి. గెలుపు కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐపీఎల్ 2022సీజన్ (IPL 2022) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరిస్థితి మ్యాచ్ మ్యాచుకీ దారుణంగా మారుతోంది. ఆ జట్టు గెలవడమే గగనంగా మారిపోయింది. లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్‌పై లక్నోసూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో, తమ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఒక్క విజయం సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఐదుసార్లు ఐపీఎల్లో చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 2015 ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది.
కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముంబై ఇండియన్స్ కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది. అయితే, ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఒక సీజన్లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇంతకముందు 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2019లో ఆర్సీబీ తమ తొలి ఆరు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయాయి. అంతేకాదు ఈ జట్లు ఆయా సీజన్లను చివరి స్థానంతో ముగించాయి. ఇప్పుడు ముంబై కూడా అదే తరహాలో పయనిస్తోంది. ముంబై ఆటతీరు చూస్తుంటే సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
గత సీజన్ వరకు ముంబై జట్టు సమతూకంగా ఉండేది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో దుర్భేద్యంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం యువ క్రికెటర్లు ఉండటం, సీనియర్లు ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. ఇషాన్, సూర్యకుమార్, తిలక్, బ్రెవిస్ వంటి వారు ఆడుతున్నా.. వ్యక్తిగతంగా రోహిత్ భారీగా పరుగులు చేయడం లేదు. ఇక హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పరిస్థితి మరీ దారుణం. ఆల్‌రౌండర్ పాత్రను పోషించడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. ఇక బుమ్రాకు బౌలింగ్‌లో సహకారం లేదు.
ఇక, రోహిత్ శర్మ ఫామ్ కూడా ముంబై ఇండియన్స్ ను కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ కలిపి (41, 10, 3, 26, 28, 6) 114 పరుగులు మాత్రమే చేశాడు. వీటిల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలయిస్తూ ఒక్క ఇన్నింగ్స్ లేకపోవడం గమనార్హం. ఇక నుంచైనా నాయకుడిగానే కాకుండా కీలక బ్యాటర్‌గా భారీ స్కోర్లు చేసి నడిపిస్తేనే ముంబయికి విజయాలు దక్కేది. లేకపోతే అత్యంత చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.