IPL 2022 ELIMINATOR LSG VS RCB LIVE SCORE UPDATES LUCKNOW SUPER GIANTS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - Eliminator : ఆగిన వర్షం.. టాస్ గెలిచిన లక్నో.. కీలక మార్పులు చేసిన రెండు జట్లు..
IPL 2022 - Eliminator
IPL 2022 - Eliminator : గెలిచిన జట్టు క్వాలిఫయర్ -2 కి.. ఓడిన జట్టు ఇంటికి. ఐపీఎల్ 2022 సీజన్ లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ తో తలపడబోయే జట్టు ఏదో మరి కొద్ది గంటల్లో తేలనుంది.
ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) ఆఖరి ఘట్టానికి చేరుకుంది.లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB)ల మధ్య హై ఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది లక్నో. జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ ల్ని పక్కన పెట్టిన లక్నో.. వారి స్థానాల్లో చమీరా, కృనాల్ పాండ్యా తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇక.. ఆర్సీబీ మహ్మద్ సిరాజ్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ప్రస్తుత సీజన్లో లక్నో జట్టు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. లీగ్ దశలో 14 మ్యాచులకుగాను 9 విజయాలు సాధించి ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, డికాక్, దీపక్ హుడా, స్టొయినిస్, కృనాల్ పాండ్య, ఎవిన్ లూయిస్, ఆయుష్ బదోని వంటి బ్యాటింగ్ దళంతో లక్నో అద్భుత విజయాల్ని సాధించింది. అయితే ఛేజింగ్‌లో టాప్ఆర్డర్ చేతులెత్తేయడంతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీంతో నాలుగు మ్యాచ్‌లను ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్టొయినిస్, హోల్డర్, దీపక్, బదోని రాణిస్తున్నా ఓటమి తప్పలేదు. కాబట్టి నాకౌట్ దశలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన ఇంటి ముఖం పట్టక తప్పదు.
బౌలింగ్ విభాగానికి వస్తే చమీర, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, స్టొయినిస్ కలిసి కట్టుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. వీరిలో అవేశ్ ఖాన్ (17) ఒక్కడే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా టాప్-10లో చోటు సంపాదించాడు. జాసన్ హోల్డర్ (14), మోహ్సిన్ ఖాన్ (8 మ్యాచుల్లోనే 13 వికెట్లు), రవి బిష్ణోయ్ (12), కృనాల్ పాండ్య (9), చమీర (9) రాణించారు. లక్నోలో దీపక్ హుడా, స్టొయినిస్, కృనాల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం.
ఈసాలా కప్ నమదే.. నినాదంతో ఆర్సీబీ ప్రతి సీజన్‌కు రావడం.. ఆ తర్వాత బొక్కబొర్లాపడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత సీజన్లోనూ లీగ్ దశకే పరిమితమై ఇంటిముఖం పడుతుందని భావించినా ఆఖరికి ఢిల్లీపై ముంబై విజయంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. జట్టు పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. కానీ మైదానంలో తేలిపోతుండటమే అసలు సమస్య. మరి అదృష్టం కలిసొచ్చి నాకౌట్‌కు చేరుకున్న బెంగళూరు తమ కప్పు కల నెరవేర్చుకోవాలంటే కష్టపడాల్సిందే.
ఈ సీజన్ ఆరంభంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదరగొట్టాడు. తర్వాత నుంచి తన స్థాయి ఆటను ఆడలేకపోయాడు. ఇక మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఒకటి అరా మ్యాచుల్లో తప్ప పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే బ్యాటింగ్‌లో మిడిల్, లోయర్‌ఆర్డర్‌ను సమన్వయం చేసుకుంటూ దినేశ్ కార్తిక్ రెచ్చిపోయాడు. 14మ్యాచుల్లో 191.33 స్ట్రైక్‌రేట్‌తో 287 పరుగులు సాధించాడు.
అయితే కార్తిక్ మాత్రమే కాకుండా మిగతా బ్యాటర్లూ లక్నోతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాణించాల్సిందే. లేకపోతే గెలవడం అంత సులువేం కాదు. బౌలింగ్‌లో బెంగళూరు పరిస్థితి ఫర్వాలేదు. వాహిందు హసరంగ (24) మోస్ట్ వికెట్స్ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ (18), జోష్ హేజిల్‌వుడ్ (15) కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ (8) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. షాబాజ్ నదీమ్ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా పోషించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.