IPL 2022 DELHI CAPITALS UNDER QUARANTINE AFTER PLAYER TESTS COVID 19 POSITIVE DETAILS HERE MKS
Covid Hits IPL 2022: భారీ షాక్: క్వారంటైన్లో ఢిల్లీ టీమ్.. ఆటగాడికి కరోనా సోకడంతో..
ఢిల్లీ జట్టు (పాత ఫొటో)
ఐపీఎల్ 2022పై కరోనా పిడుగు పడింది. కొవిడ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ఢిల్లీ జట్టులోని క్రికెటర్ ఒకరికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు..
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ఐపీఎల్ జట్లనూ కాటేస్తున్నది. కొవిడ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ఢిల్లీ జట్టులోని క్రికెటర్ ఒకరికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీ తదుపరి మ్యాచ్ పై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. ఢిల్లీ జట్టు ఇదివరకే పలు మ్యాచ్ ల్లోనూ ఆ ఆటగాడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే, మిగతా జట్లలోని ప్లేయర్లూ వ్యాధి బారిన పడితే టర్నీ నిలిచిపోయే అవకాశాలు లేకపోలేవు..
ఐపీఎల్ 15వ సీజన్ కు కూడా కరోనా ముప్పు పెద్ద ఎత్తున మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇప్పుడు ఆటగాళ్లకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. డీసీ టీమ్ సభ్యుడొకరు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోమవారం వెల్లడైంది. అయితే ఆటగాడి పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఢిల్లీ టీమ్.. సోమవారంనాడు మ్యాచ్ కోసం పూణె వెళ్లాల్సి ఉండగా షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ టీమ్ మొత్తన్నీ క్వారంటైన్ లో ఉంచుతున్నట్లు ప్రకటన వెలువడింది.
పుణె టూర్ రద్దు చేసుకున్న ఢిల్లీ టీమ్.. సోమ, మంగళవారాల్లో ఆటగాళ్లు వారి వారి గదుల్లోనే క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆరో మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో బుధవారం, ఏప్రిల్ 20న పుణెలో ఆడాల్సి ఉంది. అయితే సోమ, మంగళవారాల వరకు జట్టు ముంబైలోనే ఉండి, పూణెకు వెళ్లలేకపోతే, ఈ స్థితిలో మ్యాచ్‌కు కూడా ముప్పు ఏర్పడవచ్చు. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
గతవారం బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదవ మ్యాచ్‌కు ముందు, టీమ్ ఫిజియో ప్యాట్రిక్ కరోనా పాజిటివ్‌గా తేలారు. అయితే ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపకపోవడంతో అనుకున్న విధంగానే మ్యాచ్ జరిగింది. కానీ ఇప్పుడు ఒక ప్లేయర్ యాంటిజెన్ రిపోర్ట్ పాజిటివ్‌గా రావడంతో షెడ్యూల్ రద్దు చేసుకుని టీమ్ మొత్తాన్నీ క్వారంటైన్ లో ఉంచారు. ఇంతకుముందు, కరోనా కారణంగా IPL 2021 కూడా అంతరాయం ఏర్పడి టోర్నీని నిలిపేయడం, నెలల విరామం తర్వాత యుఏఈలో మిగతా మ్యాచ్ లు నిర్వహించడం తెలిసిందే. అంతకుముందు, 2020 సీజన్ మొత్తం యూఏఈలోనే జరిగింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.