వాంఖడే మైదానంలో పరుగుల వరద పారింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపారు. జాస్ బట్లర్ మాస్ విధ్వంసంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్ లో ఇదే భారీ స్కోరు. జాస్ బట్లర్ (65 బంతుల్లో 115 పరుగులు ; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) మరోసారి సూపర్ సెంచరీతో చెలరేగాడు. జాస్ బట్లర్ కి ఈ సీజన్ లో మూడో సెంచరీ. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 54 పరుగులు; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ ( 20 బంతుల్లో 46 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించారు. దీంతో, ఢిల్లీ ముందు భారీ టోటల్ సెట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఫస్ట్ ఐదు ఓవర్లలో నెమ్మదిగా పడిక్కల్, జాస్ బట్లర్ ఆ తర్వాత విశ్వరూపం చూపించారు.
ముఖ్యంగా ఈ సీజన్ లోనే బీభత్సమైన ఫామ్ లో ఉన్న జాస్ బట్లర్ తన దూకుడును ఈ మ్యాచులో కూడా కొనసాగించాడు. ఈ ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జాస్ మాస్ బ్యాటింగ్ కు దేవదత్ పడిక్కల్ క్లాసిక్ ఇన్నింగ్స్ తోడైంది. ఈ క్రమంలో జాస్ బట్లర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా జాస్ బట్లర్ తన ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో, ఫస్ట్ వికెట్ కు వంద పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు బట్లర్- పడిక్కల్ ల జోడి. ఆ తర్వాత పడిక్కల్ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే బట్లర్ 99 పరుగులు వద్ద ఉన్నప్పుడు దేవదత్ పడిక్కల్ రూపంలో ఢిల్లీకి ఫస్ట్ వికెట్ దక్కింది. 54 పరుగులు చేసిన పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో, 155 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత జాస్ బట్లర్ 57 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో జాస్ కి ఇది మూడో సెంచరీ. ఓవరాల్ గా నాలుగో సెంచరీ.
ఈ సీజన్ లో తన ధమాకా ప్రదర్శనతో 400 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక, ఆఖర్లో సెంచరీ తర్వాత బట్లర్.. కెప్టెన్ సంజూ శామ్సన్ తో కలిసి మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో 115 పరుగులు చేసిన బట్లర్ ని ముస్తఫిజుర్ పెవిలియన్ కు పంపాడు. సంజూ శాంసన్ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో, రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రొవెమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కే, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, IPL 2022, Prithvi shaw, Rajasthan Royals, Rishabh Pant, Sanju Samson