ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో చెన్నై చేతులేత్తేసింది. ముంబైతో జరిగిన పోరులో వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ధోని సేన. దీంతో.. ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. చెన్నైకి ఇది ఎనిమిదో ఓటమి. 98 పరుగుల లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది ముంబై. పాపం.. చెన్నై బౌలర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( 32 బంతుల్లో 34 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ తో ముంబైకి విజయాన్ని అందించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 పరుగులు నాటౌట్ ; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లతో అదరగొట్టాడు. సిమ్రజీత్ సింగ్, మొయిన్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూడా తడబడుతూ తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆదిలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కిషన్.. చౌదరి బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక, రెండు.. మూడు క్లాసీ షాట్లతో మంచి టచ్ లో కన్పించిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు.
30 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్.. సమర్జీత్ సింగ్ బౌలింగ్లో ధోనికు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక, 5 ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి రెండు వికెట్లు తీసి.. ముంబైని దెబ్బ తీశాడు. అతని బౌలింగ్లో సామ్స్ (1), స్టుబ్స్ (0) పెవిలియన్కు చేరారు. దీంతో.. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ముంబై. అయితే.. ముంబై ఇన్నింగ్స్ ని ఆదుకున్నారు యంగ్ కుర్రాళ్లు తిలక్ వర్మ, హృతిక్ సోకీన్.
ఈ ఇద్దరి ఆచితూచి ఆడుతూ.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. దీంతో.. ముంబై స్వల్ప లక్ష్యాన్ని కొద్ది కొద్దిగా కరిగిస్తూ ముందుకు సాగింది. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మొయిన్ అలీ విడదీశాడు. హృతీక్ సోకీన్ (18) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో.. 47 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖర్లో. .మిగతా పనిని టిమ్ డేవిడ్, తిలక్ వర్మ పూర్తి చేశారు.
అంతకుముందుని చెన్నైని ముంబై బౌలర్లు వణికించారు. ముంబై బౌలర్లు ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 16 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో ధోని ( 33 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిగతా వారు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సామ్స్ మూడు వికెట్లు తీయగా.. మెరిడిత్, కార్తికేయ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా, రమణ్ దీప్ చెరో ఓ వికెట్ తీశారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.