IPL 2022 CORONA EFFECT IN DELHI CAPITALS ACCORDING TO REPORTS ANOTHER DC FOREIGN PLAYER COVID POSITIVE SRD
IPL 2022 - Delhi Capitals : ఢిల్లీని వదలని కరోనా.. మరో ఆటగాడికి వైరస్.. ఇవాళ్టి మ్యాచ్ డౌటే..!
Delhi Capitals
Delhi Capitals Corona : గత ఐపీఎల్ సీజన్ లో కరోనా ఎలాంటి దుమారం రేపిందో తెలిసిందే. పలు జట్లలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడడంతో ఆ సీజన్ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించి, టోర్నీ పూర్తి చేశారు. తాజా సీజన్ లోనూ కరోనా వణికిస్తోంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనామాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మాత్రం వెంటాడుతూనే ఉంది. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఈసారి ఐపీఎల్ మొత్తాన్ని మహారాష్ట్ర (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. అయినా కూడా ఐపీఎల్ 2022 సీజన్ ని కరోనా వెంటాడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు వణికిపోతుంది. ఆ జట్టును కరోనా మహమ్మారి వదలడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. మూడు రోజుల కిందట (ఏప్రిల్ 15) జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆసీసీ స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయ్. ఇక, ఇవాళ మధ్యాహ్నం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో మరో విదేశీ ఆటగాడికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఆ ఆటగాడు ఎవరో తెలియడం లేదు. అతని పేరు బయటికి రాలేదు. దీంతో, ఇవాళ పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఢిల్లీ క్యాంపులో కేసులు పెరుగుతుండటంతో బీసీసీఐ డైలామాలో పడినట్టు తెలుస్తోంది.
ఈ ప్రచారాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఏమరోవైపు కోవిడ్ బారినపడ్డట్టుగా చెబుతున్న ఆ రెండో ఆటగాడు ఎవరో తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో డీసీ యాజమాన్యం కానీ, ఐపీఎల్ వర్గాలు కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యచ్‌ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇక జట్టులో కరోనా కేసులు రావడంతో మిగతా జట్టు సభ్యులకు కూడా భయం పట్టుకుంది. గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు జట్టు సభ్యులకు ఆరు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇటువంటి సమయంలో మ్యాచ్ కోసం పుణే వరకు బస్సులో ప్రయాణించడం మంచిది కాదనే ఉద్దేశంతో పంజాబ్ తో జరిగే మ్యాచ్ ను బ్రబోర్న్ కు బీసీసీఐ మార్చింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా మ్యాచులను నిలిపివేయాల్సి వచ్చింది. సగం మ్యాచుల తర్వాత మిగిలిన సీజన్‌ని యూఏఈ వేదికగా పూర్తి చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2021 సీజన్ అనుభవాలతో 2022 సీజన్ బయో బబుల్ నిబంధనలను కఠినతరం చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2022 సీజన్ బయో బబుల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదు. అయినా ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో బయో బబుల్ సురక్షితమైనా? అనే అనుమానాలు రేగుతున్నాయి.
అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెగ చల్లారడంతో బయో బబుల్ లేకుండా మ్యాచులు నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా పెరుగుతున్నాయి.బయో బబుల్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య, కఠినమైన ఆంక్షల మధ్య ఆడడాన్ని ప్లేయర్లు ఇబ్బందిపడుతుండడం, మానసిక ఒత్తిడికి గురి అవుతుండడంతో బయో సెక్యూర్ జోన్‌ని తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. బయో బబుల్‌ని తొలగించే ఆలోచనలో క్రికెట్ బోర్డులు ఆలోచన చేస్తున్న సమయంలో కరోనా కేసులు నమోదవ్వడంతో బీసీసీఐలో ఆందోళనన చెలరేగింది. దీంతో, బయోబబుల్ పై బీసీసీఐ వెనకడుగు వేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.