ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం అప్పుడే బీసీసీఐ (BCCI) కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ ప్రారంభ మైన సమయం లోనే కొత్త ఫ్రాంచైజీల కోసం టెండర్లు పిలిచి ఆక్టోబర్ చివరి నాటికి జట్లను ఖరారు చేయనున్నారు. కాగా, వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు అదనంగా చేరుతుండటంతో మొత్తం సంఖ్య 10కి చేరనున్నది. ప్రస్తుతం ఉన్న 8 జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ దశలో 56 మ్యాచ్‌లు ప్లేఆఫ్స్‌లో 4 మ్యాచ్‌లు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. 10 జట్లకు పెరిగిన తర్వాత ఇదే పద్దతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తే వాటి సంఖ్య 90కి దాటిపోతుంది. అందుకే కొత్త పద్దతిలో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌ల సంఖ్య పెరగటమే కాకుండా దాదాపు మూడు నెలల పాటు ఐపీఎల్ నిర్వహించాలి. అంత సుదీర్ఘ సమయం లీగ్ నిర్వహించడం వల్ల భారం పెరగడమే కాకుండా విదేశీ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండటం కష్టంగా మారుతుంది. అందుకే 2011లో కొత్త జట్లను చేర్చినప్పుడు పాటించిన పాత పద్దతినే 2022 నుంచి అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
కొత్త జట్లతో కలిపి మొత్తం 10 టీమ్స్ అవుతుండటంతో వాటిని ఐదు జట్ల చొప్పున రెండుగా విభజిస్తారు. ప్రతీ గ్రూప్‌లోని ఐదు జట్ల ప్రత్యర్థులతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. గ్రూప్ దశలో అన్ని లీగ్ మ్యాచ్‌లు ముగిసన తర్వాత పాయింట్లను బట్టి ర్యాంకులు కేటాయిస్తారు. టాప్ 4 ర్యాంకులో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. ఆ తర్వాత ఒక ఎలిమినేటర్, రెండు క్వాలిఫయర్స్, ఒక ఫైనల్ నిర్వహిస్తారు. ప్లేఆఫ్స్ ప్రస్తుతం ఉన్న పద్దతిలోనే జరుగనుండగా.. కేవలం లీగ్ దశలో మాత్రమే ఫార్మాట్ మార్చారు.
ప్రస్తుతం ఉన్న పద్దతిలోనే 10 జట్లకు కూడా మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ సిద్దంగా ఉన్నది. కానీ బ్రాడ్కాస్టర్లు మాత్రం అన్ని మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి నిరాకరించానని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఐసీసీ ఎఫ్టీపీ మ్యాచ్‌లకు అంతరాయం కలగడం వల్ల విదేశీ ప్లేయర్లు పాల్గొనకపోతే టీఆర్పీలు తగ్గిపోతాయని.. దాని వల్ల మ్యాచ్‌లు ప్రసారం చేసినా లాభాలు రాకపోవచ్చని.. అందుకే గ్రూప్ పద్దతికి మార్చినట్లు బీసీసీఐ అధికారి చెప్పారు. గ్రూప్ పద్దతిలో జరపడం వల్ల ప్రస్తుతం ఉన్న మ్యాచ్‌ల సంఖ్య 74కు పెరుగుతుంది దీనికి బ్రాడ్ కాస్టర్లు ఓకే చెప్పడంతోనే బీసీసీఐ 2011లో నిర్వహించిన ఫార్మాట్‌కు మారిందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.