IPL 2022 - BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రంజుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. మొదట్లో కాస్త చప్పగా ఆరంభమైనా ఆ తర్వాత ఆటగాళ్ల మెరుపులతో క్రికెట్ (Cricket) లవర్స్ కు మజాను అందిస్తూ సాగుతోంది. ఈ ఏడాది రెండు కొత్త జట్లు లీగ్ లో అడుగు పెట్టడంతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. అయితే మ్యాచ్ ల సంఖ్య మాత్రం గత సీజన్ లలో లాగే 74 మ్యాచ్ లకే పరిమితం చేశారు. ఇందుకోసం పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. బీసీసీఐ (BCCI) ఇప్పటి వరకు కేవలం లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ 70 లీగ్ మ్యాచ్ లను కేవలం మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మాత్రమే నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే.
ఇది కూడా చదవండి : శివ నామాలు.. మెడలో రుద్రాక్షలు.. WWEని ఏలడానికి సిద్ధమైన భారత రెజ్లర్.. ఎవరంటే?
తాజాగా లీగ్ లో సగం మ్యాచ్ లు పూర్తి కావడంతో.. బీసీసీఐ (BCCI) ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను తేదీలను ఖరారు చేసింది. అయితే ఈ నాలుగు మ్యాచ్ లు మహారాష్ట్రలో జరగడం లేదు. కోల్ కతా, అహ్మదాబాద్ నగరాలను వీటి కోసం వేదికలుగా ఖరారు చేసింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్... అహ్మదాబాద్ లోని విఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవి జరగనున్నాయి. కోల్ కతా వేదికగా మే 24, 25వ తేదీల్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనుండగా.. మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లకు వంద శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు బీసీసీఐ పేర్కొనడం విశేషం. మే 22 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్‌లకు ముందుగా నిర్ణయించినట్లుగానే 50శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది.
లక్నో వేదికగా మహిళల చాలెంజర్స్ టోర్నీ
ఇక మహిళల విభాగంలో జరిగే ఉమెన్స్ చాలెంజ్ టి20 టోర్నీ లక్నో వేదికగా మే 24 నుంచి 28 మధ్య జరగనుంది. ఎప్పటిలానే ఈసారి కూడా మూడు జట్లు పాల్గొంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Chennai Super Kings, IPL, IPL 2022, Sourav Ganguly, Sunrisers Hyderabad