IPL 2022 AFTER 2016 SEASON PLAYOFFS WITH OUT CHENNAI SUPER KINGS AND MUMBAI INDIANS SRD
IPL 2022: ముంబై, చెన్నై లేకుండానే ప్లే ఆఫ్స్.. ఆ సీజన్ తప్ప ఇలా జరగడం ఇదే తొలిసారి..!
Chennai Super Kings - Mumbai Indians
IPL 2022: ప్రతిసారి ఈ రెండు టీంలలో కచ్చితంగా ఒక జట్టు సెమీస్లోగానీ ప్లే ఆఫ్స్‌లో గానీ ఉండేది. కానీ ఈ సీజన్లో పాయింట్లు పట్టికలో అట్టడుగున నిలిచాయి. ఐపీఎల్ 14 సీజన్లలోనూ ఈ రెండు జట్లదే ఆధిపత్యం.
ఐపీఎల్ చరిత్రలో ఆ రెండు అత్యంత విజయవంతమైన జట్లు. ఒక జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. మరొకటి డిఫెండింగ్ ఛాంపియన్ సహా నాలుగు టైటిళ్లు గెల్చుకున్న టీమ్. అవే ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings). కానీ.. ప్రస్తుత ఐపీఎల్లో ఈ రెండు జట్లు చతికిలపడ్డాయి. ప్రతిసారి ఈ రెండు టీంలలో కచ్చితంగా ఒక జట్టు సెమీస్లోగానీ ప్లే ఆఫ్స్‌లో గానీ ఉండేది. కానీ ఈ సీజన్లో పాయింట్లు పట్టికలో అట్టడుగున నిలిచాయి. ఐపీఎల్ 14 సీజన్లలోనూ ఈ రెండు జట్లదే ఆధిపత్యం. ముంబై 9 సార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లి 5 సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. చెన్నై ఏకంగా 11 సార్లు ఫైనల్‌కు వెళ్లి 4 సార్లు కప్పు గెలిచింది. కానీ ఐపీఎల్ 15 సీజన్లో మాత్రం పరిస్థితి తలకిందులయ్యింది. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడే ఈ జట్లు.. ఈసారి చిట్టచివరి రెండు స్థానాల్లో నిలిచాయి. అంచనాలను అందుకోలేక చేతులేత్తేశాయ్.
ఐపీఎల్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ముంబై, చెన్నై జట్లలో ఏదో ఒక జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో ఉండేది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సీఎస్కే నిషేధానికి గురైన 2016 సీజన్ తప్పిస్తే ప్రతి ఐపీఎల్ సీజన్లోనూ ముంబై, చెన్నైలో ఒక జట్టు ప్లే ఆఫ్స్‌లో ఉంది. కానీ ఈసారి మాత్రం ఈ రెండు జట్లు లేకుండానే ప్లే ఆఫ్స్ జరగనున్నాయి.
మెగా వేలానికి ముందు ప్రతి జట్లు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేయాలని ఐపీఎల్ యాజమాన్యం కోరింది. దీంతో ముంబై ఇండియన్స్, సీఎస్కే తమకు ముఖ్యమైన ఆటగాళ్లను కొందరిని ఉంచుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. తర్వాత వేలంలోనూ కావాల్సిన వారిని దక్కించుకోలేకపోయాయి.
దీంతో, రెండు జట్లు చెల్లాచెదురయ్యాయ్. ఇక తీసుకున్న ఆటగాళ్లలోనూ కొందరు గాయాలతో దూరం కావడం ముంబై, చెన్నై జట్లకు శాపంగా మారింది. ముంబై ఇండియన్స్ పాండ్యా సోదరులను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ గాయం వల్ల చాలా మ్యాచులకు దూరం అయ్యాడు. గాయం వల్లే జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కు అందుబాటులో లేడు.
చెన్నై జట్టుకు గత సీజన్ లో టైటిల్ విజయంలో కీలకంగా పనిచేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమయ్యాడు. వేలంలో రూ.14 కోట్లు ధారపోసి మరీ అతడ్ని సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ, అతడు గాయంతో ఈ సీజన్ కు దూరమవ్వడం మైనస్ గా మారింది. ఇక, జడేజా ఫామ్ కూడా చెన్నైని కోలుకులేని దెబ్బతీసింది. మొయిన్ అలీ, రాయుడు, ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఆశించినంతగా రాణించలేదు.
మరోవైపు.. ముంబై పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఫస్ట్ 8 మ్యాచుల్లో ఒకటి కూడా గెలవని చెత్త జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.చివరకు 9 మ్యాచ్‌లో తొలిసారి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణించకపోవడం ఈ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం. సూర్యకుమార్ యాదవ్ మినహా మిడిలార్డర్ పటిష్ఠంగా లేకపోవడం, పొల్లార్డ్ ఫాం కోల్పోవడం, బుమ్రా కూడా ఆశించినంత ప్రదర్శన చేయకపోవడం వల్ల ముంబై చతికిలపడింది. మొత్తానికి రెండు టాప్ టీమ్స్ ఇలా లీగ్ స్టేజీలోనే నిష్క్రమించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.