హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : ఐపీఎల్ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్లాన్.. ఆందోళనలో బీసీసీఐ, ఆటగాళ్లు..!

IPL 2022 : ఐపీఎల్ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్లాన్.. ఆందోళనలో బీసీసీఐ, ఆటగాళ్లు..!

IPL 2022

IPL 2022

IPL 2022 : దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకులకు అనుమతి ఇస్తుండటంతో బీసీసీఐ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఓ లేటెస్ట్ న్యూస్.. బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ ను కూడా భయపెడుతోంది.

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌కు సమయం దగ్గరపడింది. భారత్ వేదికగానే ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతున్నా.. కరోనా కారణంగా ఈ సారి లీగ్‌ను ముంబై, పుణేలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ మైదానాల్లోనే లీగ్ మొత్తం జరగనుంది. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఈ లీగ్ అభిమానులను అలరించనుంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మొత్తం పది జట్లతో మ్యాచ్‌ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతివ్వనున్నారు. తొలుత ఖాళీ మైదానాల్లో నిర్వహించాలని భావించినా.. ప్రస్తుతం భారత్‌ (India)లో కరోనా పరిస్థితులు అదుపులో ఉండటంతో 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకులకు అనుమతి ఇస్తుండటంతో బీసీసీఐ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఓ లేటెస్ట్ న్యూస్.. బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ ను కూడా భయపెడుతోంది.

వివరాల్లోకెళితే.. ఐపీఎల్‌ 2022 సీజన్ కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెర లేననున్న సమయంలో ఈ వార్త కాస్త ఆందోళన కలిగించింది. అయితే, ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను టార్గెట్‌ చేస్తూ ఉగ్రవాదులు బాంబు దాడులకు దిగనున్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. ఉగ్రదాడి ముప్పు ఉందని క్విక్ రెస్పాన్స్‌ బాంబ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేగాక కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాలు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : ధనాధన్ రికార్డు విషయంలో ముంబైనే టాప్.. అందుకే ఐదు కప్పులు గెలిచింది..

మరోవైపు మహారాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ తమ బలగాలతో మార్చి 26 నుంచి మే 22 వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐతో పాటు ఐపీఎల్‌ నిర్వాహకులుకు సమాచారం అందించారు. ఇక మార్చి 26న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెరలేవనుంది.

అయితే, ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు ఉందన్న వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇంటలిజెన్స్‌ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఆ వార్తల్లో నిజమెంత అనేది తేలుస్తామని.. ముందు జాగ్రత్త చర్యగా స్టేడియం, ఆటగాళ్లు ఉండనున్న హోటల్స్‌ పరిసరాల్లో భద్రత పెంచనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు, ఈ సమాచారంతో విదేశీ ఆటగాళ్లలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, ఆటగాళ్లు ఎటువంటి ఆందోళన చెందవద్దని బీసీసీఐ ప్రకటించినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Bcci, Cricket, IPL 2022, Maharastra Govt, Terrorists

ఉత్తమ కథలు