కరోనా ఎఫెక్ట్ తో తాత్కాలికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ మలిదశ సందడి అప్పుడే మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం యూఏఈకి చేరుకుంటున్నాయ్ ఐపీఎల్ జట్లు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్లని యూఏఈకి చేర్చాయ్. ఆ జట్ల ఆటగాళ్లు బయోబబుల్ లో క్వారంటైన్ లో గడుపుతున్నారు. ఇక, ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. భుజ గాయంతో భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ అతను ఆడనున్నాడు. స్వదేశంలో గత మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ.. బౌండరీ ఆపే క్రమంలో అతను గాయపడ్డాడు. ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. కెప్టెన్ విషయంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఐపీఎల్ 2021 తొలి దశలో వరుస విజయాలు అందించిన రిషబ్ పంత్ (Rishabh Pant)కు జట్టు పగ్గాలు అందించాలా లేదా గతేడాది జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయస్‌కు అప్పగించాలా అని ఆలోచన చేస్తుందట.
ఇది కూడా చదవండి : " సచిన్ ఎంత హుందాగా ఉంటాడో చూసి నేర్చుకో కోహ్లీ " .. ఆగని మాటల యుద్ధం..
ఈ విషయాన్ని ఢిల్లీ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. " కెప్టెన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రిషబ్ పంత్ లేదా శ్రేయస్ అయ్యర్.. ఇద్దరిలో ఎవరికీ కెప్టెన్సీ ఇవ్వాలనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని ఢిల్లీ మేనేజ్మెంట్ అధికారి ఒకరు చెప్పారు. ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. లీగ్ వాయిదా పడే సమయానికి పాయింట్స్ టేబుల్ లోని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 8 మ్యాచుల్లో ఢిల్లీ 6 విజయాలు అందుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను కాదని శ్రేయాస్ అయ్యర్‌కు తిరిగి జట్టు పగ్గాలు అప్పజెప్పుతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే శ్రేయాస్ తిరిగి వచ్చినా పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం తెలుస్తోంది. ఇక అయ్యర్ స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్మిత్ కూడా ఐపీఎల్ రెండో దశ ఆడనున్నాడు. యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే యూఏఈకి చేరుకొని ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకోనున్నారు. ఐపీఎల్ తర్వాత యూఏఈలోనే టీ-20 వరల్డ్ కప్ జరగనుండటంతో.. ఈ సీజన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Delhi Capitals, IPL 2021, Rishabh Pant, Shreyas Iyer