MIvsCSK: రుతురాజ్ అద్బుత పోరాటం.. బ్రావో విధ్వంసం.. ముంబైకి మంచి టార్గెట్ సెట్ చేసిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆదుకున్న రుతురాజ్ గైక్వాడ్ (PC: IPL)

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అని భావించిన సమయంలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్‌తో 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలవడానికి 157 పరుగులు చేయాల్సి ఉన్నది.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ తొలి మ్యాచ్ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ టాప్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేశారు. ఒకానొక దశలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సీఎస్కే జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కనీసం 50 పరుగులైనా చేస్తారా అని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అద్భుత పోరాటం చేశాడు. ఫాఫ్ డు ప్లెసిస్ (0), మొయిన్ అలీ (0), అంబటి రాయుడు (0, రిటైర్డ్ హర్ట్), సురేష్ రైనా (4), ఎంఎస్ ధోనీ (3) పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి సగం జట్టు పెవీలియన్‌కు చేరింది. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా కలసి సీఎస్కే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. గైక్వాడ్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు చేశాడు. కానీ మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా ఆచితూచి నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు.

  రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా కలసి ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అయితే బుమ్రా బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (26) భారీ షాట్‌కు యత్నించి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన డ్వేన్ బ్రావో విధ్వంసం స‌ృష్టించాడు. కేవలం 8 బంతుల్లో మూడు సిక్సుల సాయంతో 23 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం చివర్లో మరింత వేగంగా పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచిన గైక్వాడ్ 58 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. బౌల్ట్, మిల్నే, బుమ్రా తలా రెండు వికెట్లు తీశాడు.

  ముంబై జట్టు ఈ మ్యాచ్ గెలవాలంటే 20 ఓవర్లలో 157 పరుగులు చేయాల్సి ఉన్నది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో ముంబై జట్టు ఓపెనర్లపై తప్పకుండా ఒత్తిడి ఉంటుంది.
  Published by:John Naveen Kora
  First published: