RR vs DC : ఓన్లీ పంత్ షో.. రాజస్థాన్ బౌలర్ల ముందు ఢిల్లీ బ్యాట్స్ మెన్ బేజారు..

RR vs DC : ఓన్లీ పంత్ షో.. రాజస్థాన్ బౌలర్ల ముందు ఢిల్లీ బ్యాట్స్ మెన్ బేజారు..

RR vs DC : రాజస్థాన్ బౌలర్లు సూపర్ బౌలింగ్ తో ఢిల్లీ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. పంత్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు.

  • Share this:
    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపారు. జై దేవ్ ఉనాద్కత్ సూపర్ స్పెల్ కు తోడుగా మిగతా బౌలర్లు రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలింది. బ్యాటింగ్ ప్రారంభం నుంచే ఢిల్లీ కు షాకులు మీద షాకులు తగిలాయ్. జై దేవ్ ఉనాద్కత్ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించిన పృథ్వీషా(5 బంతుల్లో 2).. ఈ మ్యాచ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 2వ ఓవర్‌ ఆఖరి బంతికి ఉనద్కత్‌ బౌలింగ్‌లో లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో మిల్లర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో ఓవర్‌ ఆఖరి బంతికి పృథ్వీషాను పెవిలియన్‌కు పంపిన ఉనద్కత్‌ తాను వేసిన మరుసటి ఓవర్‌(4వ ఓవర్‌) తొలి బంతికే ధవన్‌ను కూడా బోల్తా కొట్టించాడు.‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడే క్రమంలో వికెట్‌ కీపర్‌ సామ్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ధవన్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ వెంటనే, ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఉనద్కత్‌ మరో దెబ్బకొట్టాడు. నిలకడగా ఆడతాడనుకున్న రహానేని(8 బంతుల్లో 8; ఫోర్‌) పెవిలియన్‌కు పంపాడు. ఆదుకుంటాడనుకున్న ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో ఢిల్లీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బట్లర్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో స్టొయినిస్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు.

    అయితే, హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వెంటనే లేని పరుగు కోసం యత్నించిన పంత్‌(32 బంతుల్లో 51; 9 ఫోర్లు) తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 12వ ఓవర్‌ నాలుగో బంతికి సింగల్‌ తీసేందుకు ప్రయత్నించిగా, రియాన్‌ పరాగ్‌ అద్భుతమైన త్రోతో వికెట్లకు గిరాటు వేయడంతో అతను పెవిలియన్‌ బాట పట్టాడు.‌‌‌‌ ఆ తర్వాత లలిత్ యాదవ్ కూడా క్రిస్ మోరిస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 24 బంతుల్లో 20 పరుగులు చేశాడు లలిత్ యాదవ్. ఆఖర్లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్లు టామ్ కర్రన్, క్రిస్ వోక్స్ అడపా దడపా బౌండరీలు కొట్టడంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

    ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 2019 నుంచి రాజస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడిన ఢిల్లీ.. నాల్గింటిలోనూ విజయాలు అందుకుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే పై చేయి అవుతోంది.
    Published by:Sridhar Reddy
    First published: