• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 KOLKATA KNIGHT RIDERS TIM SEIFERT BREAKS DOWN IN TEARS WHILE RECOUNTING HIS COVID 19 EXPERIENCE IN INDIA GH SRD

IPL 2021 : ఆ పరిస్థితి తలుచుకొని కన్నీరు పెట్టుకున్న కోల్​కతా నైట్​రైడర్స్ ప్లేయర్​..

Photo Credit : Twitter

IPL 2021 : బయోబబుల్​లో కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలడంతో ఐపీఎల్ 14వ సీజన్​ను బీసీసీఐ అర్ధాంతరంగా వాయిదా వేసింది. మరో 31 మ్యాచ్​లు మిగిలి ఉండగానే టోర్నీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

  • Share this:
ఐపీఎల్ 14వ సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుతో పాటు ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్ కన్నీరు పెట్టుకున్నాడు. లీగ్​లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను తలుచుకొని ఓ ఇంటర్వ్యూలో హఠాత్తుగా ఏడ్చేశాడు. బయోబబుల్​లో ఉన్న తనకు కరోనా పరీక్షల్లో పాజిటివ్​ అని తేలగానే ఎంతో భయపడ్డానని చెప్పాడు. అలాగే తన దేశ ప్లేయర్లంతా స్వదేశానికి బయలుదేరుతుంటే తాను మాత్రం భారత్​లో క్వారంటైన్​లో ఉండాల్సి రావడంతో ఎంతో బాధపడ్డానని చెబుతూ ఏకంగా కన్నీరు కార్చాడు.‘నాకు కరోనా పరీక్షలో పాజిటివ్​గా తేలినట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మేనేజర్ రిజల్ట్​ చూపించారు. ఆ సమయంలో నాకు ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. చాలా భయపడ్డా. చాలా భయానక పరిస్థితుల గురించి వినడంతో నాకు కూడా అలా జరుగుతుందోమోనని భయపడ్డా’ అని సీఫెర్ట్ చెప్పాడు.పేసర్​ అలీ ఖాన్​ గాయం కారణంగా 14వ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకోవడంతో అతడి స్థానంలో సీఫెర్ట్​ను కేకేఆర్ రిప్లేస్​మెంట్​గా తీసుకుంది. తనకు పాజిటివ్​ వచ్చి ఎంతో బాధపడుతున్న సమయంలో కుదుటపడేందుకు న్యూజిలాండ్ మాజీలు బ్రెండన్ మెక్​కలమ్​, స్టీఫెన్ ఫ్లెమింగ్ ధైర్యం చెప్పారని సీఫెర్ట్ గుర్తు చేసుకున్నాడు.

“క్లిష్టపరిస్థితులను సునాయంగా భావించేలా వారు సహకరించారు. అన్ని విషయాలు సర్దుకుంటాయని చెప్పారు. అలాగే కేకేఆర్​ సీఈవో, సీఎస్​కే మేనేజ్​మెంట్ కూడా ధైర్యం చెప్పింది. పాజిటివ్ వచ్చి కొన్ని రోజులు గడిచాక నా ఆందోళన కాస్త తగ్గింది. సానుకూలంగా ఆలోచించా” అని సీఫెర్ట్ చెప్పాడు. కాగా రెండు నెలల్లో తన వివాహం కావాల్సిన సమయంలో ఇలా జరుగడం బాధగా అనిపించిందని అతడు అన్నాడు. “నేను స్వదేశానికి వచ్చాక నాకు కాబోయే భార్య ఎంతో సంతోషించింది. పెళ్లి ప్లానింగ్​లో నేను కూడా ఇక సహకరించగలను” అని సీఫెర్ట్ అన్నాడు.


బయోబబుల్​లో కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలడంతో ఐపీఎల్ 14వ సీజన్​ను బీసీసీఐ అర్ధాంతరంగా వాయిదా వేసింది. మరో 31 మ్యాచ్​లు మిగిలి ఉండగానే టోర్నీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఐపీఎల్ వాయిదా పడ్డాక విదేశీ ప్లేయర్లందరూ స్వదేశాలకు చేరుకున్నారు. కాగా ఐపీఎల్​లో మిగిలిన మ్యాచ్​లను యూఏఈ వేదికగా సెప్టెంబర్​ – అక్టోబర్ మధ్య నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. టీ20 ప్రపంచకప్​కు ముందు ప్రాక్టీస్​లా ఐపీఎల్ ఉంటుందని కూడా భావిస్తోంది. అయితే ఐపీఎల్ రెండో దశలో అన్ని దేశాల ప్లేయర్లు పాల్గొంటారా అన్నది సందేహంగా మారింది. ఆ సమయంలో వివిధ అంతర్జాతీయ సిరీస్​లు ఉండడంతో ఫారిన్ ప్లేయర్లు కొందరు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29న నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్ రెండో దశపై బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుంది. టోర్నీ షెడ్యూల్​, వేదికలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by:Sridhar Reddy
First published: