ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు (Play Off Race) ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం అసలు పోరాటం మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు సిసలు పోరుకు రెడీ అయ్యాయ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ (KKR Vs RR). షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీ ఫైట్ లో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయ్. నాలుగో స్థానంలో నిలవాలంటే.. ఈ పోరు కోల్ కతా కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో గెలిస్తే కచ్చితంగా కోల్ కతా కే మెరుగైన అవకాశాలుంటాయ్. ఇక, రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి .. మిగతా సమీకరణాలతో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని భావిస్తోంది. ఈ రోజు జరిగే డబుల్ హెడ్డర్ లో రెండో మ్యాచ్ ఇది. కీలక పోరు అవ్వడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కోల్ కతా బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లు కీలకంగా మారారు. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, కెప్టెన్ మోర్గాన్ ఫామ్ కోల్ కతాని కలవరపెడుతోంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరుకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో టిమ్ సౌథీ, శివమ్ మావిలు కీలకం కానున్నారు.
మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి భిన్నంగా ఉంది. సంజూ జట్టు గత మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఆ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ తప్ప.. ఏ బ్యాటర్ పరుగులు చేయడం లేదు. ఎవిన్ లూయిస్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కీలక మ్యాచ్ కావడంతో యశస్వి జైపాల్, గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే రాణించాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్‌కు పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియాలు ఫర్వాలేదనిపిస్తున్నారు. వారు రాణిస్తే శాంసన్ సేనకు తిరుగుండదు.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడ్డాయ్. ఇందులో 12 మ్యాచ్ ల్లో కోల్ కతా గెలవగా.. మరో 11 గేమ్స్ లో రాజస్ధాన్ విజయకేతనం ఎగురవేసింది. వీరిద్దరి మధ్య జరిగిన గత మ్యాచ్ లో కోల్ కతా పై రాజస్థాన్ విక్టరీ కొట్టింది.
తుది జట్లు అంచనా :
కోల్ కతా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హసన్/ ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.
రాజస్తాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్/లియామ్ లివింగ్ స్టోన్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహమాన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, IPL 2021, Kolkata Knight Riders, Rajasthan Royals, Sanju Samson