IPL 2021 Final - CSK Vs KKR : క్లైమాక్స్ ఫైట్ లో హీరో ఎవరు..? టాస్ గెలిచిన KKR..

IPL 2021 Final - CSK Vs KKR

IPL 2021 Final - CSK Vs KKR : ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది.

 • Share this:
  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 (IPL 2021 Season Latest Updates) క్లైమాక్స్ కు చేరుకుంది. దసరా ధమాకాలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి (IPL Final CSK Vs KKR). దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ మెగా ఫైట్ లో కోల్ కతా, చెన్నై ఎటువంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నాయ్. క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కి చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ని ఎలిమినేటర్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్‌ని క్వాలిఫయర్-2లో ఓడించిన కోల్‌కతా ఫైనల్‌కి దూసుకొచ్చింది. లీగ్ దశలో చెన్నై వరుస ఓటములను ఎదుర్కొనగా.. కోల్‌కతా మాత్రం వరుస విజయాలతో సత్తాచాటింది. దీంతో చెన్నైతో పోలిస్తే.. కోల్‌కతా ఇప్పుడు మంచి ఫామ్‌లో కనిపిస్తోంది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :
  ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. గత ఆరు మ్యాచుల్లో కోల్‌కతాపై చెన్నై ఐదింటిలో గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్‌.. బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండనుంది.

  14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. ఫైనల్ చేరిన రెండు సార్లూ టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డే చెన్నై జట్టులో టెన్షన్ పెంచుతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి.2012లో కోల్‌కతా.. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించింది.


  సీఎస్‌కే జట్టుకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప ప్రధాన బలంగా మారారు. ముఖ్యంగా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
  ఇక, గత మ్యాచ్ లో ధోనీ ఫామ్ లోకి రావడం చెన్నైకి ప్లస్ పాయింట్. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన స్టామినాను చూపించాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్లలో రవీంద్రుడు ఒకడు. బౌలింగ్ విభాగంలో జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

  అలాగే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. వికెట్ల వెనకాల దినేశ్ కార్తీక్, డగౌట్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్, బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, బౌలింగ్‌లో సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, శివమ్ మావి వంటి ప్లేయర్ల పర్ఫామెన్స్ కారణంగా కేకేఆర్ ఫైనల్ చేరింది.

  వీరందరూ మరోసారి సత్తా చాటితే కోల్ కతాకు తిరుగుండదు. అయితే, కెప్టెన్ మోర్గాన్ వైఫల్యం ఆ జట్టును బాధిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణమైన సగటు నమోదుచేసిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ఇయాన్ మోర్గాన్, 2021 సీజన్‌లో 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు.

  తుది జట్లు :

  చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

  కోల్‌కతా నైట్ రైడర్స్:

  శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
  Published by:Sridhar Reddy
  First published: