IPL 2021 Final - CSK Vs KKR : చెన్నై విజిల్ పోడు.. యెల్లో ఆర్మీదే సింహాసనం.. ఓవరాల్ గా నాలుగో టైటిల్..

IPL 2021 Final

IPL 2021 Final - CSK Vs KKR : దుబాయ్ లో చెన్నై సింహాలు గర్జించాయ్. ఐపీఎల్ 14 వ సీజన్ విజేతగా ధోనీ సేన నిలిచింది. ఓవరాల్ గా నాలుగో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

  • Share this:
    ఐపీఎల్ (IPL Season Updates) లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 14 వ సీజన్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఓవరాల్ గా ఇది చెన్నై సూపర్ కింగ్స్ కు నాలుగో టైటిల్. చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 193 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా చేతులేత్తయడంతో యెల్లో ఆర్మీ  విజిల్ వేసింది. ధోనీ ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా పండుగే.  కోల్ కతా ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, శుభ్ మన్ గిల్ లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన.. మిగతా బ్యాటర్లు రాణించలేదు. ఫైనల్స్ లో తమకున్న రికార్డును కోల్ కతా నిలబెట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు  కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు  వికెట్లతో సత్తా చాటాడు. జోషె హాజెల్ వుడ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

    193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా కు ఓపెనర్లు గుడ్ స్టార్ అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కేకేఆర్ నయా స్టార్ వెంకటేశ్ అయ్యర్ మరోసారి సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్ లో డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో జడేజాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


    దీంతో 91 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వెంటనే నితీశ్ రానా, సునీల్ నరైన్ వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది కోల్ కతా. నితీశ్ రానా వికెట్ ను శార్దూల్ తీయగా.. సునీల్ నరైన్ ను జోష్ హాజెల్ వుడ్ పెవిలియన్ కు పంపాడు. మరో ఎండ్ లో శుభ్ మన్ గిల్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

    హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే గిల్(43 బంతుల్లో 51 పరుగులు).. దీపక్ చాహర్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక, ఆ తర్వాత ఏ కోల్ కతా బ్యాటర్ కూడా రాణించింది లేదు. పెవిలియన్ కు వెళ్లడానికి పోటీ పడ్డారు కోల్ కతా బ్యాటర్లు. ఆఖర్లో  ఫెర్గ్యూసన్, శివమ్ మావీ మెరుపులు మెరిపించనప్పటికీ అప్పటికే ఆలస్యం అయింది.

    ఇక, అంతకు ముందు ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ దుమ్మురేపారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన కోల్‌కతానైట్‌రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.

    ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.
    Published by:Sridhar Reddy
    First published: