Rishabh Pant: ఢిల్లీ కెప్టెన్‌గా‌ రిషబ్ పంత్.. ఐపీఎల్‌లో అతడి టాప్-5 ఇన్నింగ్స్ ఇవే..

Rishabh Pant

టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. తాజాగా మరో కీలక అవకాశం అతడిని వరిం?

  • Share this:
టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. తాజాగా మరో కీలక అవకాశం అతడిని వరించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతడు ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. IPL 2020లో పంత్ పేలవమైన ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌లలో 113.95 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు మాత్రమే చేశాడు. అతడు ఆడిన ఐదు IPL సీజన్లలో ఇదే తనకు అత్యల్ప రికార్డు కావడం విశేషం. అయినా కూడా ఢిల్లీ జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. గత ఐపీఎల్‌ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన సిరీస్‌లలో పంత్ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌పై టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలోనూ సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఈ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా IPLలో పంత్‌ ఆడిన అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లను పరిశీలిద్దాం.

* 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 128 నాట్ అవుట్
ఈ మ్యాచ్‌లోనే పంత్ ఐపీఎల్‌లో మొదటిసారి సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 63 బంతుల్లో 128 పరుగులు సాధించాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ 15 ఫోర్లు, ఏడు సిక్స్‌లు కొట్టాడు. మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమైనా కూడా అతడు ఆత్మవిశ్వాసంతో విజృంభించాడు. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత క్రీజులోకి వచ్చాడు. తన సెంచరీతో ప్రత్యర్థి జట్టుకు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. కానీ సన్‌రైజర్స్ జట్టులో శిఖర్ ధావన్ 92*, కేన్ విలియమ్సన్ 83* పరుగులు చేసి హైదరాబాద్‌ను 9 వికెట్ల తేడాతో గెలిపించారు.

* 2019లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 78 నాట్ అవుట్
2019 ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్ ఇది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. తన జట్టులో కీలక ఆటగాళ్లను బుమ్రా అవుట్ చేసిన తరువాత, 14వ ఓవర్లో పంత్ క్రీజులోకి వచ్చాడు. కేవలం 27 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 213/6తో భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై జట్టును 176 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గెలుపొందింది.

* 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు
ఈ మ్యాచ్‌లో పంత్ విశ్వరూపం చూపాడు. గుజరాత్ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఢిల్లీ ఛేదించింది. ఇందుకు ప్రధాన కారణం రిషబ్ పంత్. మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన అతడు, సంజు శామ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్స్‌లు బాదాడు.

* 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు
ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఢిల్లీకి 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో.. ఢిల్లీ జట్టు తొమ్మిది ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత వచ్చిన పంత్ 45 బంతుల్లో 79 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. దీంట్లో 7ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కఠిన సమయంలో మెరుగ్గా రాణించినప్పటికీ, ఇతర ఆటగాళ్ల మద్దతు లేకపోవడంతో ఢిల్లీ జట్టు చెన్నైపై ఓడిపోయింది.

* 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగులు
ఈ మ్యాచ్‌లో పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 48 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో బెంగళూరుకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ప్రత్యర్థి జట్టులో డివిలియర్స్ 39 బంతుల్లో 90 పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు.
First published: