Hooda: దీపక్ హుడాపై బీసీసీఐ సీరియస్.. యాంటీ కరప్షన్ యూనిట్ నిఘాలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు

పంజాబ్ ఆటగాడు దీపక్ హుడాపై బీసీసీఐ సీరియస్ (PC: Punjab Kings)

బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ దీపక్ హుడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై బోర్డు సీరియస్ అయ్యింది. అతడిని వెంటనే యాంటీ కరప్షన్ యూనిట్ నిఘా లోనికి తీసుకొని వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..

  • Share this:
    పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆల్‌రౌండర్ దీపక్ హుడాపై  (Deepak Hooda) బీసీసీఐ (BCCI) సీరియస్ అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతడిపై యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) (ACU) నిఘా పరిధిలోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న రెండో దశ ఐపీఎల్‌లో (IPL 2021) హుడా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్‌కు ముందు జట్టుకు చెందిన వివరాలను హుడా లీక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో హుడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంజాబ్ కింగ్స్ తుది జట్టులో తాను ఆడుతున్నట్లు చెబుతూ ఒక ఫొటో పోస్టు చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు అయినా సరే.. తుది జట్టులో ఆడుతున్నట్లు తెలిసినా సరే ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదు.

    ఆటగాళ్లు కోవిడ్ నిబంధనలతో పాటు ఇతర నిబంధనలు అన్నీ తప్పకుండా పాటించాలని బీసీసీఐ ముందుగానే హెచ్చరించింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బయటకు తెలియజేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రతీ జట్టుకు, ఆటగాళ్లకు ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనే మార్గదర్శకాలను అందజేసినట్లు ఏసీయూ అధికారి చెప్పారు. అయినా సరే నిబంధలను ఉల్లంఘిస్తూ దీపక్ హుడా తాను తుది జట్టులో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనిపైనే బీసీసీఐ సీరియస్ అయ్యింది. పంజాబ్ కింగ్స్ 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఐదు పరుగులే చేసి ఓటమి పాలయ్యింది. చివరిలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా డకౌట్ అయ్యి పెవీలియన్ చేరాడు. దీంతో హుడాపై అనుమానాలు మొదలయ్యాయి.

    IPL 2021: సన్‌రైజర్స్ జట్టులో కరోనా కలకలం.. నటరాజన్‌కు కోవిడ్ పాజిటివ్.. ఐసోలేషన్‌లో ఆరుగురు జట్టు సభ్యులు


     






    దీపక్ హుడా జూనియర్ క్రికెటర్ ఏమీ కాదు. ఎన్నో ఏళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. బరోడా రంజీ జట్టుకు ఎన్నో సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్ నిబంధనల గురించి ఎంతో అవగాహన ఉన్న దీపక్ హుడా ఏసీయూ మార్గదర్శకాలను ఉల్లంఘించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుకోకుండా పెట్టిన పోస్టా? లేదంటే బుకీలకు హింట్ ఇచ్చాడా? అని ఏసీయూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఒక సీనియర్ క్రికెటర్ ఏసీయూ నిఘాలోకి వెళ్లడం ఆ జట్టుపై తప్పక ప్రభావం చూపుతుంది.
    Published by:John Naveen Kora
    First published: